89 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌

89 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌
  • 89 దేశాలకు పాకింది
  • ఇప్పటికైతే దీని ఎఫెక్ట్​ కొద్దిగనే
  • ముందుముందు ఎట్టుంటదో
  • అన్ని దేశాలూ అలర్ట్​గా ఉండాలె: డబ్ల్యూహెచ్​వో

జెనీవా/న్యూఢిల్లీ:  కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చాలా స్పీడ్ గా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) శనివారం వెల్లడించింది. ఇప్పటిదాకా 89 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని తెలిపింది. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ప్రారంభమైన దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఒకటిన్నర నుంచి 3 రోజుల్లోనే డబుల్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, వ్యాక్సిన్ లు, ఇమ్యూన్ సిస్టం నుంచి ఈ వేరియంట్ తప్పించుకుంటుందా? అన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని తెలిపింది. వేగంగా వ్యాపించే కెపాసిటీతో పాటు ఇమ్యూనిటీని తప్పించుకునేలా మ్యుటేషన్ చెందడమే దీని వ్యాప్తికి కారణం కావచ్చని పేర్కొంది. మొదట సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన తర్వాత దీనిని డబ్ల్యూహెచ్ వో నవంబర్ 26న వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కేటగిరీలో చేర్చినట్లు ప్రకటించింది. ఇది స్పీడ్ గా వ్యాపిస్తున్నప్పటికీ పేషెంట్ల ఆరోగ్యంపై పెద్దగా ఎఫెక్ట్ చూపించడంలేదు. అయితే దీని ఎఫెక్ట్ ను అంచనా వేసేందుకు ఇంకా తగినంత క్లినికల్ డేటా అందుబాటులోకి రాలేదని, ఇప్పుడే దీని తీవ్రతను చెప్పలేమని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. ఒమిక్రాన్ పట్ల అన్ని దేశాలూ అలర్ట్ గా ఉండాలని, వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. 

వెంటనే కట్టడి చేయాలె: పూనమ్ ఖేత్రపాల్ 

కొత్త వేరియంట్ సౌత్ ఈస్ట్ ఏసియా ప్రాంతంలోని 7 దేశాలకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్​వో రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ వెల్లడించారు. ఒమిక్రాన్​ కట్టడికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయా దేశాలకు సూచించారు. కేసులు భారీగా పెరిగితే హాస్పిటల్స్​పై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. హాస్పిటల్స్ లో ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, ఇతర సౌలతులను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.  

ఢిల్లీలో 5 ఒమిక్రాన్ దవాఖాన్లు 

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం నాలుగు ప్రైవేట్ దవాఖాన్లను ప్రత్యేకంగా ఒమిక్రాన్ సెంటర్లుగా మార్చింది. ఢిల్లీలో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్ ను ఒమిక్రాన్ దవాఖానగా మార్చారు. తాజాగా సర్ గంగారాం, ఫోర్టిస్, మ్యాక్స్, బాత్రా హాస్పిటల్స్ ను కూడా ఒమిక్రాన్ సెంటర్లుగా మార్చినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం నాటికి 22 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

బూస్టర్ డోసుగా కొవొవ్యాక్స్ బెస్ట్: అనురాగ్ 

పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవొవ్యాక్స్ కరోనా టీకా బూస్టర్ డోస్ గా అద్భుతంగా పని చేస్తుందని ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కరోనావైరస్2 జీనోమిక్స్ కన్సార్షియం) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ వెల్లడించారు. అమెరికన్ కంపెనీ నొవొవ్యాక్స్ ఇంక్ అభివృద్ధి చేసిన కరోనా టీకాను మన దేశంలో కొవొవ్యాక్స్ పేరుతో సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తోంది. దీనికి శుక్రవారమే డబ్ల్యూహెచ్​వో అనుమతి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుగా కొవిషీల్డ్ కన్నా కొవొవ్యాక్స్ టీకానే బాగా పని చేస్తుందని అనురాగ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.