ఒమిక్రాన్​.. మరిన్ని వేవ్​లకు దారితీయొచ్చు:WHO

V6 Velugu Posted on Nov 30, 2021

  • ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్​వో హెచ్చరిక
  • ఇది మరిన్ని వేవ్​లకు దారితీయొచ్చు..
  • ఒమిక్రాన్​పై టెక్నికల్ పేపర్ విడుదల

 జెనీవా/ న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచానికి పెద్ద రిస్క్ పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందే తీరు, దీనివల్ల ఎదురయ్యే ముప్పుపై మరింత రీసెర్చ్ జరగాల్సి ఉందని తెలిపింది. ఈ వేరియంట్ స్పైక్ లో దాదాపు 32 మ్యుటేషన్లు జరిగాయని, తీవ్రంగా వ్యాపించే ప్రమాదం ఉన్నందున దీనిని ‘ఆందోళనకర వేరియంట్’ లిస్టులో చేర్చినట్లు డబ్ల్యూహెచ్ వో ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికే 13  దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, మరో రెండు దేశాలకూ వైరస్ పాకి ఉంటుందన్న వార్తల నేపథ్యంలో దీని గురించి వివరిస్తూ సోమవారం ఒక టెక్నికల్ పేపర్ ను రిలీజ్ చేసింది. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ మన ఇమ్యూన్ సిస్టంను తప్పించుకుంటూ తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉంది” అని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. ఇది కూడా మిగతా వేరియంట్ల మాదిరిగా ప్రపంచమంతా వ్యాపించవచ్చని, మళ్లా వేవ్ లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ ప్రపంచమంతా పాకి మరిన్ని వేవ్ లు వస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మొత్తంగా దీనితో ప్రపంచానికి వెరీ హై రిస్క్ పొంచి ఉందని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ తో మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే కన్పిస్తున్నా, ఇప్పటివరకూ ఈ వేరియంట్ తో ఎవరూ చనిపోకున్నా.. చాలా స్పీడ్ గా వ్యాపించే చాన్స్ ఉన్నందున ప్రపంచానికి తీవ్ర ముప్పుగా మారుతుందని అభిప్రాయపడింది. 

Tagged warning, WHO, World, Nations, wave, omicron

Latest Videos

Subscribe Now

More News