ధన్​ఖడ్ ​వర్సెస్ ​జయాబచ్చన్​

ధన్​ఖడ్ ​వర్సెస్ ​జయాబచ్చన్​
  •  రాజ్యసభలో మరోసారి ‘పేరు’ వివాదం
  • తనను సంభోదిస్తున్న తీరు సరికాదంటూ ఎస్పీ ఎంపీ ఫైర్​
  • తనకు పాఠాలు చెప్పొద్దని చైర్మన్ ​హెచ్చరిక
  • వాకౌట్​ చేసిన జయాబచ్చన్​
  • మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష సభ్యులు

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు హాట్​హాట్​గా జరిగాయి. శుక్రవారం రాజ్యసభలో మరోసారి నటి, సమాజ్​వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయాబచ్చన్​పేరుపై వివాదం నెలకొన్నది. కొన్నిరోజుల క్రితం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై బీజేపీ ఎంపీ ఘనశ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలపై చర్చ సందర్భంగా.. జయా అమితాబ్ బచ్చన్​ మాట్లాడాలంటూ చైర్మన్​ధన్​ఖడ్ సంభోదించారు. దీంతో జయాబచ్చన్​ అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను పదేపదే కావాలని అలా పిలుస్తున్నారంటూ ఫైర్​అయ్యారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ.. “నాకు పాఠాలు చెప్పొద్దు” అని మండిపడ్డారు. 

కాగా, చైర్మన్​వెంటనే క్షమాపణ చెప్పాలని జయాబచ్చన్​ డిమాండ్ చేయడంతో సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సహా జయాబచ్చన్​కు ప్రతిపక్ష సభ్యులు మద్దతుగా నిలిచారు. సభనుంచి వాకౌట్​ చేశారు. ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌ హరివంశ్‌‌ నారాయణసింగ్‌‌.. ‘జయా అమితాబ్‌‌ బచ్చన్‌‌’ మాట్లాడాలని ఆహ్వానించగా.. ఆమె  అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను జయాబచ్చన్​ అంటే సరిపోతుందని, మహిళలకు భర్తపేరు లేకుండా గుర్తింపు ఉండదా? అని ప్రశ్నించారు.

చైర్మన్ ​మాట తీరు బాధించింది: జయాబచ్చన్​

సోనియాగాంధీతో కలిసి జయాబచ్చన్​ మీడియాతో మాట్లాడారు. సభలో చైర్మన్ మాటతీరు తీవ్రంగా బాధించిందని తెలిపారు. ‘‘చైర్మన్ నన్ను సంబోధించిన తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మేం స్కూల్ ​స్టూడెంట్లం కాదు.. మాలో సీనియర్​ సిటిజన్లు కూడా ఉన్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నిల్చొని, మాట్లాడేటప్పుడు కూడా మైక్ కట్​చేశారు. అవమానకరంగా ప్రవర్తించారు. 

మీరు సెలెబ్రిటీ అయితే ఏంటి..? నేను పట్టించుకోను అని నన్ను అంటున్నారు. నేను నటినే కాదు.. రాజ్యసభకు ఐదోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఏం మాట్లాడాలో నాకు తెలుసు” అని జయాబచ్చన్​ పేర్కొన్నారు. సభలో ఇలాంటి ప్రవర్తనను తాను ఎన్నడూ చూడలేదని, గౌరవప్రదమైన సీట్లో కూర్చున్నవాళ్లు అన్​పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చైర్మన్​ వెంటనే క్షమాపణ చెప్పాలని జయాబచ్చన్​ డిమాండ్​ చేశారు. 

వాయుయాన్​ విధేయక్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఏవియేషన్​ స్పేస్​లో సులభతర వాణిజ్య పద్ధతులను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన భారతీయ వాయుయాన్ ​విధేయక్​ బిల్లు–2024కు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఎయిర్‌‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. కొత్త చట్టం ద్వారా సందిగ్ధాలన్నింటికీ తెరదించుతున్నామని ఆ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌‌ నాయుడు తెలిపారు. 

విమాన చార్జీల పెంపుతో సహా ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి సమర్థవంతమైన ఆన్‌‌లైన్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మనిర్భర్‌‌ భారత్‌‌కు పెద్దపీట వేస్తూ డిజైన్, తయారీకి సంబంధించిన నిబంధనలు కూడా ఇందులో పొందుపరిచామని మంత్రి తెలిపారు.

పలుమార్లు వాయిదాపడ్డ రాజ్య సభ

వివిధ అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరగడంతో లంచ్​కు ముందు రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం జయాబచ్చన్​ పేరుపై వివాదం సందర్భంగా సభలో గందరగోళం నెలకొన్నది. 

మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎలాంటి కారణం చెప్పకుండా సభను అరగంటపాటు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం 2:30 గంటలకు  తిరిగి సమావేశమైన తర్వాత ఆయన సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు ఎగువ సభ తిరిగి సమావేశమైనప్పుడు, హరివంశ్ సభను 3:30 గంటలకు వాయిదా వేశారు.

ప్రతిపక్షంపై చైర్మన్ పక్షపాతం: కాంగ్రెస్​

రాజ్యసభలో ప్రతిపక్షాలపై చైర్మన్​ జగదీప్ ​ధన్​ఖడ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్​ మండిపడింది. సభలో అపోజిషన్​కు చైర్మన్ ప్రాధాన్యం ఇవ్వడంలేదని పేర్కొన్నది. చైర్మన్​ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్​ చేసిన అనంతరం కాంగ్రెస్​ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఒక్క కాంగ్రెస్​పైనే కాకుండా సభలోని ప్రతిపక్షాల సభ్యులు అందరిపైనా చైర్మన్​ పక్షపాతం చూపిస్తున్నార ని కాంగ్రెస్​ నేత అజయ్​ మాకెన్​ ఆరోపించా రు. 

రాజ్యసభలోనే ప్రతిపక్షాల గొంతు వినిపించకపోతే.. ఇక ఎక్కడ వినిపిస్తుందని ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత అయిన మల్లికార్జున ఖర్గేను కూడా మాట్లాడనివ్వడం లేదని, తరచూ మైక్​ కట్​చేస్తూ అంతరాయం కలిగిస్తున్నారని కాంగ్రెస్​ ఎంపీ ప్రమోద్​ తివారీ మండిపడ్డారు.