గ్రూప్ 2 వాయిదాపై.. ఎల్లుండిలోగా తేల్చండి

గ్రూప్ 2 వాయిదాపై.. ఎల్లుండిలోగా తేల్చండి
  • అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రంపై ఏం నిర్ణయం తీసుకున్నరు?
  • కోర్టుకు 5 లక్షల మంది రాలేరు.. 
  • వచ్చిన వాళ్ల హక్కులను పరిరక్షించాల్సిందే

హైదరాబాద్ వెలుగు:  గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిపై సోమవారంలోగా తేల్చాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌‌‌‌పీఎస్సీ)ను హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రంపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. కోర్టుకు 5 లక్షల మంది రాలేరని, వచ్చింది కొంత మందే అయినా వారి హక్కులను పరిరక్షించాల్సిందేనని వ్యాఖ్యానించింది. 14వ తేదీ లోపు ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. గురుకుల టీచర్, జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ తదితర 21 పోటీ పరీక్షలు ఒకే నెలలో ఉన్నాయని, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని టీఎస్‌‌‌‌పీఎస్సీని కోరితే పట్టించుకోలేదంటూ డి.మహేశ్‌‌‌‌తోపాటు మరో 149 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవి దేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ. గిరిధర్‌‌‌‌‌‌‌‌రావు వాదనలు వినిపించారు. 

‘‘పోటీ పరీక్షల్లో గ్రూప్-1, 2, 3, 4లకు ప్రాధాన్యం ఉంటుంది. డిగ్రీ అర్హత ఉన్నందున లక్షల మంది ఈ పరీక్షలకు పోటీ పడతారు. 9 నుంచి 10 ఏళ్ల తర్వాత నిర్వహిస్తుండటంతో పోటీ ఎక్కువగా ఉంది. ఆగస్టు 2 నుంచి 30 దాకా 21 పరీక్షలు ఉన్నాయి. వీటితోపాటు కేంద్ర ఉద్యోగాలు, బ్యాంకింగ్ పరీక్షలు ఉన్నాయి. సిలబస్ కూడా వేర్వేరుగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధం కావడానికి ఇబ్బందిగా ఉంటుంది. నోటిఫికేషన్ 2022లో ఇచ్చినా.. షెడ్యూలు మాత్రం ఇటీవల ఇచ్చారు. వాయిదా కోరుతూ జూన్, జులైలో టీఎస్‌‌పీఎస్సీకి వినతి పత్రం సమర్పించాం. వారు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించాం. అంతేగానీ చివరి క్షణంలో కోర్టుకు రాలేదు’’ అని వివరించారు.

వాయిదా అవసరం లేదు: టీఎస్‌‌పీఎస్సీ

టీఎస్‌‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘‘గ్రూప్ 2 కోసం 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల షెడ్యూలును ఫిబ్రవరిలోనే విడుదల చేశాం. గురుకుల బోర్డు మార్చిలో నోటిఫికేషన్ జారీ చేసి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 29, 30 తేదీల్లో సెలవులు కూడా ప్రకటించారు. గురుకుల పరీక్షలు, జూనియర్ లెక్చరర్లు సహా అన్నింటికంటే ముందే గ్రూప్-2 పరీక్షల షెడ్యూలును విడుదల చేశాం. గ్రూప్-2 పరీక్షలు అడ్డంకి కాదు. అందువల్ల పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరం లేదు” అని చెప్పారు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్లు సమర్పించిన వినతి పత్రాన్ని పరిష్కరించారా అంటూ ప్రశ్నించింది. వాయిదాపై 14వ తేదీలోపు తేల్చాలని ఆదేశించింది.