కొత్త వేరియంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

కొత్త వేరియంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

 

  •     మన్‌‌కీ బాత్‌‌లో ప్రధాని మోడీ
  •     వ్యాక్సినేషన్‌‌లో గ్లోబల్‌‌గా మెరుగ్గా ఉన్నాం

న్యూఢిల్లీ: కరోనాను ఓడించేది సమష్టి బలమేనని, 2022 ఏడాదిలోకి మనం ఈ బాధ్యతతో అడుగుపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌‌ను అడ్డుకునేందుకు.. వ్యక్తిగత అప్రమత్తత, క్రమశిక్షణే అతిపెద్ద బలమని అన్నారు. ఆదివారం మన్‌‌కీ బాత్‌‌లో ప్రధాని మాట్లాడారు. వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా అసాధారణరీతిలో పనిచేసిందని, ప్రపంచ దేశాల తో పోలిస్తే చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. కొత్త వేరియంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘ఒమిక్రాన్ వేరియంట్‌‌పై మన సైంటిస్టులు రివ్యూ చేస్తున్నారు. ప్రతిరోజు కొత్త సమాచారం తెలుసుకుంటున్నారు. వారు ఇచ్చే సూచనల ఆధారంగా చర్యలు చేపడుతున్నాం” అని వెల్లడించారు. ‘‘దేశంలో 140 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేయడం ప్రతిఒక్క ఇండియన్ సాధించిన విజయం. మన సంకల్ప శక్తికి ఇది నిదర్శనం. అలాగే వ్యవస్థ, సైన్స్, సైంటిస్టులపై పౌరుల నమ్మకాన్ని ఇది నిరూపిస్తోంది’’ అని చెప్పారు. 15 నుంచి 18 ఏండ్ల వారికి జనవరి 3 నుంచి వ్యాక్సిన్ వేస్తామని, జనవరి 10 నుంచి హెల్త్‌‌కేర్, ఫ్రంట్‌‌లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోసు వేస్తామని తెలిపారు.  

కెప్టెన్ వరుణ్‌‌ సింగ్.. దేశానికి స్ఫూర్తినిచ్చారు..
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌‌‌‌లో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ట్రీట్​మెంట్​ తీస్కుంటూ చనిపోయిన గ్రూప్ కెప్టెన్ వరుణ్‌‌ సింగ్ గురించి ప్రధాని ప్రస్తావించారు. వరుణ్ సింగ్ ‘శౌర్య చక్ర’ అవార్డు అందుకున్న తర్వాత ఆయన చదివిన స్కూలుకు రాసిన లెటర్‌‌‌‌ గురించి మాట్లాడారు. ‘‘వరుణ్ ఉన్నత స్థాయికి చేరుకున్నా కూడా మూలాలను మరిచిపోలేదు. తాను చదువుకున్న స్కూలుకు లెటర్ రాశారు. సంబురాలు చేసుకోవాల్సిన సమయంలో.. భవిష్యత్ తరాల గురించి ఆలోచించారు. తాను చదువుకున్న స్కూలులోని స్టూడెంట్ల జీవితాలు కూడా వేడుకగా సాగాలని కోరుకున్నారు. తన లెటర్​ ఒక్కరికి స్ఫూర్తినిచ్చినా.. తనకెంతో సంతోషమని అన్నారు. కానీ ఆయన మొత్తం దేశాన్ని ఇన్‌‌స్పైర్ చేశారు” అని ప్రధాని మోడీ మెచ్చుకున్నరు.

పరీక్షా పే చర్చ పెడుత
ప్రతి ఏడాది మాదిరిగానే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నానని మోడీ చెప్పారు. Mygov.in. వెబ్‌‌సైట్‌‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా స్టూడెంట్లు, ఇతర వ్యక్తులను కోరారు. ‘‘పెద్దగా ఆలోచించండి.. పెద్దగా కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి పని చేయండి. ఈ సంకల్పంతో రాబోయే సంవత్సరంలో దేశం ముందుకు సాగుతుంది. కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో 2022 ఏడాది గోల్డెన్ పేజ్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని ప్రధాని మోడీ అన్నారు.