ఓరుగల్లు వరదపై..‘నాలా’ స్త్రం!

ఓరుగల్లు వరదపై..‘నాలా’ స్త్రం!
  •     గ్రేటర్​ వరంగల్​లో శరవేగంగా నాలా విస్తరణ
  •     తాజాగా 50 ఏండ్ల కింది నయీంనగర్​ పాత బ్రిడ్జి కూల్చివేత
  •     బీఆర్‍ఎస్‍ పదేండ్ల పాలనలో హామీలు, శంకుస్థాపనలే!
  •     కొత్త సర్కారు అధికారంలోకి రాగానే మారిన సీన్​
  •     మూడు నెలల్లోనే శాశ్వత పరిష్కారం దిశగా వర్క్స్​
  •     ట్రై సిటీ వాసుల హర్షం 

వరంగల్‍, వెలుగు : గత పదేండ్లలో పర్యటనలు, హామీలు, శంకుస్థాపనలు, కేసులకే పరిమితమైన వరంగల్​వరద నివారణ పనులు కాంగ్రెస్​ హయాంలో చడీచప్పుడు లేకుండా షురువయ్యాయి.  రూ.90  కోట్లతో చేపట్టిన నయీంనగర్​ నాలా విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా  కీలకమైన నయీంనగర్‍ పెద్ద మోరీ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. సిటీలోని వరదకు అడ్డుపడ్తున్న 50 ఏండ్ల కింది ఇరుకైన పాత బ్రిడ్జిని ఆఫీసర్లు కూల్చేశారు. రూ.8 కోట్ల 50 లక్షలతో కొత్త బ్రిడ్జి పనులు శుక్రవారం  స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ప్రారంభించారు.  రాబోయే వానాకాలానికి ముందే, మూడు నెలల్లో నాలా విస్తరణ పనులతో పాటు కొత్త బ్రిడ్జి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు.

బీఆర్ఎస్​హయాంలో హామీలు, శంకుస్థాపనలతోనే అగిన్రు  

ఏటా వానాకాలంలో గ్రేటర్ వరంగల్‍ సిటీ వరదలతో అతలాకుతలమవుతోంది. వందలాది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఇండ్లల్లోకి నడుంలోతు నీళ్లొస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి 2023 వరకు వచ్చిన వరదలు వరంగల్​ను వణికించాయి. వేలాది కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. ఈ నాలుగేండ్లలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు విడువగా.. వందలకోట్ల రూపాయల ఆస్తి నష్టం జరి గింది.  పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్‍ సర్కార్‍ వరద నివారణ చర్యలపై  హామీలు ఇవ్వడం తప్పించి అడుగు ముందుకు వేయలేదు. 

మూడేండ్ల క్రితం అప్పటి మున్సిపల్‍ మంత్రి కేటీఆర్‍ వరంగల్​లో పర్యటించి, నయీంనగర్‍ నాలాను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామంటూ 2021 గ్రేటర్ వరంగల్​ ఎలక్షన్స్​ ముందు  పనులకు కొబ్బరికాయలు కొట్టి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి వచ్చిన కేటీఆర్​..నాలా విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.  మూడేండ్లు గడిచినా పనుల్లో కదలిక లేకుండా పోయింది. ఈలోపు వరంగల్‍ సిటీలో మూడుసార్లు వరద ముంచెత్తింది. అప్పటి బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలే జనంతో కేసులు వేయించి, విస్తరణ పనులను అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. 

డిసెంబర్‍ 7న ప్రభుత్వం.. ఫిబ్రవరి 7న పనులు షురూ

రాష్ట్రంలో డిసెంబర్‍ 7న కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  గ్రేటర్ ఎమ్మెల్యేలుగా ఉన్న మంత్రి కొండా సురేఖ, నాయిని రాజేందర్‍రెడ్డి వచ్చీరాగానే వరద ముంపు చర్యలపై ఫోకస్​ చేశారు. కావాల్సిన ఫండ్స్ కేటాయించారు. దీంతో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఫిబ్రవరి 7న నయీంనగర్‍ నాలా ఆక్రమణల తొలగింపు, నాలా వెడల్పు, ఇరువైపులా రిటైనింగ్‍ వాల్‍ పనులను  ఎమ్మెల్యే నాయిని ప్రారంభించారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకపోవడంతో అధికారులు గడిచిన రెండు నెలల్లోనే నయీంనగర్‍ నాలా ఆక్రమణల్లో 95 శాతం కూల్చివేశారు. 

శరవేగంగా నాలా అడుగు భాగంలో సిమెంట్‍ స్లాబ్‍, ఇరువైపులా రిటైనింగ్‍ వాల్‍ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఆక్రమణతో నాలా కొన్నిచోట్ల కేవలం నాలుగైదు మీటర్లకు కుంచించుకపోయింది. కాగా, అధికారులు ప్రస్తుతం నయీంనగర్ నాలాను 25 మీటర్ల వెడల్పుతో విస్తరిస్తున్నారు. ఇరువైపులా 5 మీటర్ల రిటర్నింగ్ వాల్‍ కడుతున్నారు. దాదాపు రూ.90 కోట్లతో చేపట్టిన ఈ పనులు గడువులోగా పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

50 ఏండ్ల కింది బ్రిడ్జి కూల్చివేత 

ప్రస్తుతం ఉన్న నయీంనగర్‍ బ్రిడ్జిని 50 ఏండ్ల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. సిటీ పరిధి విస్తరించడంతో పెరిగిన వరద నీరు స్వేచ్ఛగా వెళ్లకుండా ఇరుకు బ్రిడ్జి అడ్డుపడుతోంది. దీంతో పాత బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మించడం తప్పనిసరయ్యింది. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.8.5 కోట్ల స్మార్ట్​ ఫండ్స్ కేటాయించింది. జూన్, జూలై నెలల్లో వర్షాలు ప్రారంభం కానుండడంతో ఆలోగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొత్త బ్రిడ్జి పనులను శుక్రవారం ఎమ్మెల్యే నాయిని ప్రారంభించారు.

 గతంలో 16 మీటర్ల వెడల్పు ఉన్న బ్రిడ్జిని దాదాపు 24 మీటర్ల వెడల్పు చేస్తున్నారు.  కింది భాగంలో వరదనీరు సాఫీగా వెళ్లేలా 10 మీటర్ల అడుగుతో 3 ఖానాలు ఏర్పాటు చేయనున్నారు. 32 మీటర్ల పొడవు ఉండే బ్రిడ్జి నిర్మాణంలో చివర్లో ఉండే పిల్లర్లతో సంబంధం లేకుండా మధ్యలో రెండు బలమైన పిల్లర్లు కట్టనున్నారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలంలో మరోసారి వరద ముంపు సమస్య రాకుండా వచ్చే మూడు నెలల్లోనే శాశ్వత పరిష్కారం చూపేలా పనులు సాగుతుండడంపై ట్రై సిటీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.