హిందూ సంప్రదాయాలకు విరుద్ధం.. గుడి పూర్తి కాకుండానే ప్రతిష్ఠాపననా?

హిందూ సంప్రదాయాలకు విరుద్ధం.. గుడి పూర్తి కాకుండానే  ప్రతిష్ఠాపననా?
  • ఇది హిందూ సంప్రదాయాలకు విరుద్ధం
  • అందుకే మేము అయోధ్యకు రావట్లేదు 
  • నలుగురు శంకరాచార్యుల ప్రకటన

లక్నో:  అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  వాల్మీకి మహర్షి అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) చేపట్టింది. నిఘాలో భాగంగా  ఎల్లో జోన్‌‌‌‌లో ఫేస్ రికగ్నిషన్ చేసే 10,715 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయోధ్య రైల్వే స్టేషన్‌‌‌‌లో  ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 15 వరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో  పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటు వేడుకల సందర్భంగా  ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి ప్రాణ-ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ 22న రామ్ లల్లాకు పట్టాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత మహోత్సవం నిర్వహించనున్నారు. 

వనవాసంపై అవగాహనకు మ్యూజియం

అయోధ్యను సందర్శించే యాత్రికుల కోసం సరయూ నది ఒడ్డున 'రామాయణ ఆధ్యాత్మిక వనం' ఏర్పాటు చేశారు. త్వరలో దాన్ని ప్రారంభించనున్నారు. ఈ వనం రాముడి 14 ఏండ్ల వనవాసంపై భక్తులకు లోతైన అవగాహన కల్పించనుంది. దీన్ని అయోధ్య మాస్టర్ ప్లాన్‌‌‌‌లో భాగంగా ఓపెన్ -ఎయిర్ మ్యూజియం మాదిరిగా  నిర్మిస్తున్నారు.  స్పిరిచ్యువల్ ఫారెస్ట్ అనేది నదీ తీరానికి పొడిగింపుగా ఉంటుంది. పర్యావరణ అనుకూలమైన విధానంలో ఈ అడవిని రూపొందించారు. రామాయణంలో  
శ్రీరాముని వనవాస ప్రయాణాన్ని ఇది వర్ణిస్తుంది.

గుడి పూర్తికాకుండానే ప్రతిష్ఠాపనా? మేం రాం: నలుగురు శంకరాచార్యులు 

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాము హాజరుకాబోమని నలుగురు శంకరాచార్యులు ప్రకటించారు. ప్రతిష్ఠాపన వేడుకలను ఉత్తరాఖండ్‌‌‌‌ జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, పూరీ గోవర్ధన్‌‌‌‌పీఠ్‌‌‌‌ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి పూర్తిగా వ్యతిరేకించారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమేమిటని నిలదీశారు. ఇది హిందూ మతానికి  విరుద్ధమన్నారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో దేవుడిని ప్రతిష్ఠించడం మంచిది కాదన్నారు. తమ నిర్ణయం ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని.. తాము ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా కూడా వెళ్ళలేమని స్పష్టం చేశారు. అలాగే, శృంగేరి పీఠాధిపతి స్వామి భారతీకృష్ణాజీ, ద్వారక పీఠాధిపతి స్వామి సదానంద్ మహరాజ్ కూడా గుడి పూర్తికాకుండానే విగ్రహ ప్రతిష్ఠాపనను వ్యతిరేకించారు.