రేపు కేసీఆర్ అధ్యక్షతన లెజిస్లేటివ్, పార్లమెంటరీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ 

రేపు కేసీఆర్ అధ్యక్షతన లెజిస్లేటివ్, పార్లమెంటరీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ 

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 15న టీఆర్ఎస్ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది టైమ్ మాత్రమే ఉండడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. మునుగోడులో అంతా కలిసి ప్రచారం చేసినా అనుకున్నంత మెజార్టీ రాకపోవడంతో రానున్న ఎన్నికల్లో ఎవరికి వారే క్యాంపెయిన్ చేసుకునే పరిస్థితులు ఉంటాయని, దీంతో ఇప్పటి నుంచే సన్నద్ధతపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్​తో కలిసి పని చేస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ వారితో పొత్తు పెట్టుకుంటే, కొన్ని సీట్లను వదులుకునేందుకు రెడీగా ఉండాలని నేతలకు కేసీఆర్ స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో పాటు బీజేపీని ఎదుర్కోవడం, రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని చేసిన కామెంట్లను ఎలా తిప్పికొట్టాలనే దానిపై క్యాడర్​తో ఆయన చర్చించనున్నారు. టీఆర్ఎస్ పేరును మార్చాలని ఇప్పటికే ఈసీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. దీనిపై అభ్యంతరాలకు ప్రకటన కూడా ఇచ్చారు. త్వరలోనే ఈసీ ఆమోదం వస్తే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కేసీఆర్ వివరించనున్నట్లు తెలిసింది. గుజరాత్​ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్​చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ సమావేశంలో స్పష్టత రానుంది.