ఎఫ్ఐఏ, ఆటా ఆధ్వర్యంలో ఇండియా డే పరేడ్

ఎఫ్ఐఏ, ఆటా ఆధ్వర్యంలో ఇండియా డే పరేడ్
  • మన దేశ ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో పాల్గొన్న అల్లు అర్జున్

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్య్ర దినోత్సవరం సందర్భంగా అమెరికాలో ఇండియా డే పరేడ్​ను ఘనంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(ఎఫ్ఐఏ), అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో న్యూయార్క్​లో నిర్వహించిన ఈ వేడుకల్లో అమెరికా నలుమూలల నుంచి వచ్చిన భారతీయులు పాలుపంచుకున్నారు. ఈ పరేడ్​లో ఇండియా ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో సినీ నటుడు అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ రెడ్డి బుజాల, ఆటా న్యూజెర్సీ రీజనల్ కో ఆర్డినేటర్ సంతోష్ రెడ్డి కోరం, విలాస్ రెడ్డి జంబుల ఆటా తరుపున ఇండియన్స్ కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తో కలిసి అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ ను అనుకరించారు. ఆటా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఓ రథం లాంటి వాహనంపై చూపిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. చిన్నారులు, కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. పోతరాజు, డప్పు కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

కోలాహలంగా పరేడ్

ఆటా మాజీ ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, పరశురామ్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ.. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌‌, ఫిలడెల్ఫియా, డెలావేర్, మన్‌‌హట్టన్‌‌లో నివసించే భారతీయులు సుమారు 5 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున న్యూయర్క్ డే పరేడ్ కు ఎన్ఆర్ఐలు రావడం ఓ రికార్డు అని ఆటా ప్రతినిధులు తెలిపారు. సంతోష్ రెడ్డి కోరం మాట్లాడుతూ అమెరికన్లు కూడా ఇండియా పరేడ్ లో పాల్గొని విజయవంతం చేశారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆటా సభ్యుడు శరత్​ వేముల అన్నారు. పరేడ్ ను చూసేందుకు వచ్చిన ఎన్ఆర్ఐలు, న్యూయార్క్ ప్రజలు "భారత్ మాతాకీ జై", "వందేమాతరం", "జై హింద్’’, ‘‘జై జవాన్-జై కిసాన్" నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆటా తరుపున సంతోష్ రెడ్డి కోరం కృతజ్ఞతలు తెలిపారు.