గోడలపై ఆకట్టుకుంటున్న మహనీయుల బొమ్మలు

గోడలపై ఆకట్టుకుంటున్న మహనీయుల బొమ్మలు

ఒకప్పుడు ఆ గోడలు  రంగు వెలసిపోయి, దుమ్ము పట్టి ఉండేవి. వాటిపక్కనే చెత్తాచెదారం వేసేవాళ్లు. అలాంటి గోడలు ఇప్పుడు కొత్త రంగులద్దుకున్నాయి. మనదేశ చరిత్రని, ఈ నేలపై పుట్టిన మహనీయుల బొమ్మలతో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ బొమ్మల​కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ప్రతి బొమ్మ పక్కన క్యుఆర్​ కోడ్​ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ బొమ్మకి సంబంధించి వివరాలు తెలుస్తాయి. ఈ వాల్​ ఆర్ట్​ వెనుక బెంగళూరుకు చెందిన ముగ్గురు ఫ్రెండ్స్​ ఉన్నారు. ‘ఫ్రీడమ్​ వాల్’ ప్రాజెక్ట్​లో భాగంగా పాత గోడలకు కొత్త సొబగులు అద్దుతున్నారు వీళ్లు. 

బెంగళూరులోని  సివి. రామన్​ హాస్పిటల్ రోడ్డు, ఫిఫ్త్ క్రాస్​ రోడ్డుని ‘ఫ్రీడమ్​ వాల్​’ గా మార్చేశారు   దుశ్యంత్​ దూబె, సమీర్​ కులకర్ణి, సత్యజిత్ ఇంద్రమోహన్​. వీళ్లకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. రోజూ అదే దారి గుండా వెళ్లేవాళ్లు ఈ ముగ్గురు. స్కూలు పిల్లలు, హాస్పిటల్​కి వచ్చేవాళ్లు ఆ దారిలో వెళ్లేందుకు ఇబ్బంది పడడం గమనించారు. అధ్వానంగా ఉన్న ఆ గోడలకు రంగులు వేసి, అందంగా మార్చాలనుకున్నారు. ఇదే విషయం అక్కడివాళ్లకు చెప్పారు. అందరూ కలిసి లోకల్ ఎమ్మెల్యేను కలిశారు. ఆయన అందుకు ఒప్పుకోవడంతో పాటు  డబ్బు సాయం కూడా చేశాడు. దాంతో ఏప్రిల్​ నెలలో ‘ఫ్రీడమ్ వాల్​’ ప్రాజెక్ట్​  మొదలుపెట్టారు ఈ ముగ్గురు​.  పెయింటర్స్, ఇలుస్ట్రేటర్స్ వీళ్లతో చేతులు కలిపారు. వీళ్ల ఆలోచన నచ్చి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇటలీ, కొలంబియా నుంచి కూడా  ఆర్టిస్ట్​లు బొమ్మలు వేసేందుకు ముందుకొచ్చారు.  

క్యుఆర్​ కోడ్ స్కాన్​ చేసి..

చంద్రశేఖర్​ ఆజాద్​, గణిత మేధావి శ్రీనివాస రామానుజన్​తో పాటు కర్నాటకకు చెందిన  సి.వి.రామన్​, మహాకవి కువెంపుతో పాటు శ్రీకృష్ణ దేవరాయలు, ఇంజనీర్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్య బొమ్మలు కనిపిస్తాయి. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పెద్దపులిని కూడా చూడొచ్చు. ప్రతి బొమ్మ పక్కన క్యుఆర్​ కోడ్​ ఉండడం ఈ ఫ్రీడమ్​ వాల్​ ప్రత్యేకత. ఆ కోడ్​ని స్కాన్ చేస్తే వికీపీడియా, బ్రిటానిక వంటి ఎన్​సైక్లోపీడియా సైట్స్​ ఓపెన్ అవుతాయి. వాటిలో ఆ ఫొటోలోని వ్యక్తి వివరాలు ఉంటాయి. మీకు తెలిసిన భాషలో ఆడియో కూడా వినొచ్చు. వీళ్ల ఆర్ట్​వర్క్​చూసి అహ్మదాబాద్​లో కూడా ఫ్రీడమ్ వాల్​ క్రియేట్​ చేయాలని  కోరింది గుజరాత్​ ప్రభుత్వం. 

ఈజీగా అర్థమయ్యేలా...

‘‘మనదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, రాజులు, సైంటిస్ట్​లు, పర్యావరణవేత్తల్ని గుర్తు చేయాలనేది మా ప్రాజెక్ట్ ఉద్దేశం. మా ఆర్ట్​వర్క్​ని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు గోడల మీద 58 బొమ్మలు వేశాం. ఆ బొమ్మల్లోని వ్యక్తుల్ని మొదటిసారి చూసినవాళ్లకు కూడా వాళ్లు ఎందుకు  పాపులర్​ అయ్యారో అర్థమయ్యేలా బొమ్మలు వేశాం” అంటున్నాడు ఈ ప్రాజెక్ట్​ క్రియేటివ్​ డిజైనర్​ దుశ్యంత్ దూబె.