‘ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ’లపై ధరణిలో ఆప్షన్

‘ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ’లపై ధరణిలో ఆప్షన్
  • నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపునకు చాన్స్
  • ఫీరడం ఫైటర్స్, మాజీ సైనికులు సహా 3 లకష్ల మందికి ఊరట
  • భూముల లీజ్ అగిరమెంట్ కూ ఆప్షన్

హైదరాబాద్, వెలుగు: గతంలో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన భూములను.. అందులో నుంచి తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు అవకాశం కల్పించింది. ధరణి పోర్టల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే.. అన్ని ఆధారాలు పరిశీలించి, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు నుంచి ఆ భూములకు విముక్తి కల్పించనుంది. పోర్టల్‌లో ‘గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్​క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్’ అనే ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. 2007లో అప్పటి వైఎస్ సర్కార్ అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ ల్యాండ్స్ పరిరక్షణకు ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ జాబితాను సిద్ధం చేసింది. ఇలాంటి భూముల రిజిస్ట్రేషన్ ను నిషేధిస్తూ రిజిస్ట్రేషన్ల చట్టంలో 22(ఏ) సెక్షన్‌ను చేర్చింది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్, అసైన్డ్, సీలింగ్ ల్యాండ్స్ ఉండాల్సిన ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్టులో.. సుమారు 8 లక్షల ఎకరాల పట్టా భూముల సర్వే నంబర్లు తప్పుగా నమోదయ్యాయని విమర్శలు ఉన్నాయి. దీంతో పట్టాదారులు తమ భూములను అమ్ముకోలేక.. కుటుంబీకులకు మ్యుటేషన్ చేసుకోలేక తిప్పలు పడుతున్నారు. 

బాధితుల్లో ఫ్రీడం ఫైటర్లు, మాజీ సోల్జర్లు

రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో సుమారు 32 లక్షల ఎకరాల భూములు ఉండగా, అసైన్డ్ భూములే 22 లక్షల ఎకరాల దాకా ఉన్నాయి. ఈ జాబితాలో సీలింగ్ కింద పోను మిగిలిన భూములు, ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు సుమారు 8 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. రూల్స్ ప్రకారం ఫ్రీడమ్ ఫైటర్లు, మాజీ సైనికులకు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములను పదేళ్ల తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. కానీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తొలగించకపోవడం, కలెక్టర్లు ఎన్వోసీ ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు తాజా నిర్ణయంతో ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులు సహా దాదాపు 3 లక్షల మందికి ఊరట దక్కనుంది.
లీజ్ అగ్రిమెంట్ కూడా ధరణిలోనే
వ్యవసాయ భూమిని కౌలుకు లేదా లీజుకు తీసుకునే సందర్భంలో సాధారణంగా వైట్​పేపర్​ లేదా బాండ్​ పేపర్లపై అగ్రిమెంట్లు రాసుకుంటారు. ఇకపై లీజ్ అగ్రిమెంట్ కూడా ధరణి ద్వారా చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పోర్టల్‌లో లాగిన్ అయి ‘అప్లికేషన్ ఫర్ లీజ్’ ఆప్షన్​పై క్లిక్​ చేసి లీజ్​పట్టాదారు పాస్ బుక్ నంబర్ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత లీజుకు తీసుకునే వ్యక్తి పేరు, అడ్రస్, లీజుకు చెల్లించే మొత్తం, టైం వివరాలు నమోదు చేయాలి.