మరోసారి వ్యాక్సిన్ ధర తగ్గించిన సీరం సంస్థ

మరోసారి వ్యాక్సిన్ ధర తగ్గించిన సీరం సంస్థ

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతోంది. కేంద్ర చొరవతో సీరం సంస్థ గతంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గించింది. కేంద్రానికి రూ. 150, రాష్ట్రాలకు రూ.400లకు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది. వన్ నేషన్.. వన్ ట్యాక్స్ అమలు చేసినప్పుడు.. వన్ నేషన్.. వన్ వ్యాక్సిన్ ఎందుకుండకూడదంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దాంతో రాష్ట్రాలకు వ్యాక్సిన్లు ఉచితంగా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. 

తాజాగా మరోసారి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గిస్తున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ట్వీట్ చేశారు. రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరను రూ. 400ల నుంచి రూ. 300లకు తగ్గించి అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ తగ్గించిన ధర వెంటనే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. 

‘రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధర రూ .400 నుంచి రూ .300కు తగ్గిస్తున్నాను. ఆ ధర వెంటనే అమలులోకి వస్తుంది. ఇలా చేయడం వల్ల రాష్ట్రాలకు చెందిన వేల కోట్ల నిధులు ఆదా అవుతాయి. ధర తగ్గడం వల్ల ఎక్కువ టీకాలు ఇచ్చి లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడవచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు.