
- ఒక బార్డర్, ముగ్గురు శత్రువులు..
- ‘ఆపరేషన్ సిందూర్’లో పాక్కు చైనా, టర్కీ కూడా సాయం చేశాయి
- ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కామెంట్
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్‌కు వ్యతిరేకంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (కేపబిలిటీ డెవలప్ మెంట్ అండ్ సస్టినాన్స్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ కీలక వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్‌కు చైనా, టర్కీ ఆయుధ సామగ్రి అందించి సాయం చేశాయని ఆయన తెలిపారు. పాక్ ఆయుధాల్లో 81 శాతం ఆయుధాలు చైనావే అని చెప్పారు.
‘న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్’ పై శుక్రవారం ఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన సెమినార్లో రాహుల్ మాట్లాడారు. టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడి సరిహద్దుల వద్ద శత్రు దేశం డేటాను సేకరించామని తెలిపారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌కు ముందు మొత్తం 21 టార్గెట్లను గుర్తించాం. వాటిలో చివరి క్షణంలో తొమ్మిదింటిని లక్ష్యంగా చేసుకున్నాం. మరోవైపు పాక్కు చైనా, టర్కీ నుంచి వెపన్లు వచ్చాయి.
అంటే, బార్డర్లో ముగ్గురు శత్రువులతో భారత బలగాలు పోరాడాయి. భారత్, పాక్ సంక్షోభాన్ని చైనా ‘లైవ్ ల్యాబ్’ లా వాడుకుంది. పాక్ తో సంబంధాలను ప్రయోగాలు నిర్వహించేందుకు చైనా ఒక అవకాశంగా చూస్తోంది. ఇందుకోసం పాక్కు భారీగా అత్యాధునిక ఆయుధాలను పంపుతోంది. ఇతర దేశాల ఆయుధాలపై చైనా వారి ఆయుధాలను టెస్ట్ చేస్తోంది” అని లెఫ్టినెంట్ జనరల్ వివరించారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో చర్చలు జరుగుతున్నపుడు భారత్ గురించి పాక్కు చైనా లైవ్ అప్ డేట్స్ పంపిందని, శాటిలైట్లు వాడి భారత మిలిటరీ మోహరింపును చైనా గుర్తించిందని ఆయన వెల్లడించారు. భారత్ కు ఇబ్బంది కలిగించడానికి పాక్‌ను చైనా వాడుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో మనకు బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టం అవసరమని సూచించారు. టర్కీ కూడా పాక్కు ఆయుధాలు సమకూర్చి సపోర్ట్ చేసిందని తెలిపారు.
పాక్కు రూ.70 వేల కోట్ల విలువైన ఆయుధాలు సప్లై
పాక్కు చైనా 2015 నుంచి రూ.70 వేల కోట్ల విలువైన ఆయుధాలను అమ్మిందని స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ (సిప్రి) తెలిపింది. 2020 నుంచి 2024 మధ్య ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా చైనా నిలిచిందని సిప్రి వెల్లడించింది.