కరోనా వ్యాక్సిన్‌: మరణించే ముప్పు 97.5% దూరం

కరోనా వ్యాక్సిన్‌: మరణించే ముప్పు 97.5% దూరం

న్యూఢిల్లీ: కరోనా నుంచి రక్షణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని మరోసారి తేలింది. కనీసం ఒక్క డోసు వేసుకున్నా కూడా మరణించే ముప్పు నుంచి 96.6 శాతం బయటపడిటనట్టే. అదే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటే 97.5 శాతం సేఫ్‌. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 18 నుంచి ఆగస్టు 15 మధ్య చేసిన అధ్యయన ఫలితాలను ఐసీఎంఆర్‌‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్‌ భార్గవ గురువారం వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఏప్రిల్, మే నెలల మధ్య కరోనా బారినపడి మరణించిన వారిలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ వేసుకోని వాళ్లే ఉన్నారని ఆయన తెలిపారు. 18 ఏండ్ల వయసు మొదలు 60 ఏండ్ల పైబడిన వాళ్ల వరకూ అందరిలోనూ కరోనా వ్యాక్సిన్ పనితీరు బాగుందని, మరణించే ముప్పును ప్రభావవంతంగా తప్పించగలుగుతోందని చెప్పారు. 

72 కోట్ల వ్యాక్సిన్ డోసులు..

రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు వైరస్ నుంచి దాదాపు పూర్తి సంరక్షణ దొరుకుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు, కొవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వీకే పాల్ అన్నారు. దేశంలో  18 ఏండ్ల దాటిన వారిలో 58 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందిందని, ఇది వీలైనంత తర్వగా వంద శాతం కావాలని, ఏ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోకుండా మిగిలిపోకూడదని ఆయన చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 72 కోట్లకు పైగా డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు మిగిలిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ వేయాలని వీకే పాల్ అన్నారు. మన దేశంలో వ్యాక్సినేషన్ చాలా వేగంగా పుంజుకుంటోందని, మే నెలలో రోజుకు సగటున 20 లక్షల డోసులు వేస్తుండగా, సెప్టెంబర్‌‌లో ఆ సంఖ్య 78 లక్షలకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషణ్‌ తెలిపారు. మే నెల మొత్తంలో వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య కంటే సెప్టెంబర్ మొదటి వారం రోజుల్లో వేసిన సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 86 కోట్ల డోసులు వేశామన్నారు. ఈ పండుగల సీజన్‌లో వ్యాక్సినేషన్ మరింత వేగంగా జరగాలని, వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వాళ్లకు వ్యాక్సిన్ త్వరగా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో పని చేయాలని రాజేశ్ భూషణ్‌ అన్నారు.