ఒక్కరోజు లెక్చరర్లు!

ఒక్కరోజు లెక్చరర్లు!

ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. సరైన సంఖ్యలో ఫ్యాకల్టీ లేకపోవడంతో యాజమాన్యాలు  కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. సింగిల్​ విజిట్​కు ​రూ.15 వేలు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. 

హైదరాబాద్, వెలుగు: జేఎన్​టీయూ అఫిలియేషన్​ కోసం మొన్నటి దాకా ఫ్యాకల్టీకి 3 నెలల శాలరీస్​ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకున్న కొన్ని ఇంజనీరింగ్​ కాలేజీల మేనేజ్​మెంట్లు.. ఇప్పుడు మరో కొత్తదందాకు తెరలేపాయి. ప్రస్తుతం కాలేజీల్లో తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్న యాజమాన్యాలు ‘వాంటెడ్​ఫ్యాకల్టీ.. సింగిల్​విజిట్​రూ.15 వేలు’ అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. వీటిన్నిటికీ చెక్ పెట్టాల్సిన జేఎన్టీయూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే  విమర్శలు వస్తున్నాయి. 
కరోనాతో లెక్చరర్ల తొలగింపు..
రాష్ట్రంలో 166  ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలుండగా, 30 వేల మంది వరకు ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు.ఈ ఏడాది ఆయా కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చేందుకు జేఎన్టీయూ గురువారం నుంచి తనిఖీలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రొఫెసర్లతో టీంలను ఏర్పాటు చేసింది. తనిఖీల్లో ప్రధానంగా కోర్సులు, స్టూడెంట్లకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉన్నారా లేదా..? వారి సర్టిఫికెట్లు, ల్యాబ్, ఇతర ఫెసిలిటీస్ కాలేజీల్లో చెక్ చేసి, వాటి ఆధారంగా కాలేజీలకు అఫిలియేషన్ ఇస్తారు. అయితే ఫ్యాకల్టీ తప్పకుండా ఉండాలనే నిబంధన ఉండటంతో కొన్ని కాలేజీలు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో జీతాలు ఇవ్వలేక చాలా కాలేజీలు ఫ్యాకల్టీని తొలగించాయి. మరికొన్ని కాలేజీల్లో ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా సరిపడా ఫ్యాకల్టీ లేరు. దీంతో తనిఖీల సమయంలో మేనేజ్​మెంట్లకు అత్యవసరంగా సిబ్బంది అవసరమయ్యారు. దీంతో కన్సల్టెన్సీలను అప్రోచ్ అవుతున్నారు. వాటి ద్వారా  తెలిసిన లెక్చరర్లను, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో సిబ్బంది కావాలనే పోస్టులు పెడుతున్నారు. సింగిల్ విజిట్ కు రూ.15వేలు  ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. దీనికి జేఎన్టీయూ ఐడీ, మినిట్స్ ఆఫ్ సెలక్షన్ కమిటీ(ఎస్​ఈఎం), రిలీవింగ్ లెటర్ ఉండాలనే నిబంధన పెడుతున్నారు. జేఎన్టీయూలో 89 వేల మంది ఫ్యాకల్టీ రిజిస్టరై ఉండగా వారిలో సగం మంది కూడా పనిచేయడం లేదు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలు మానేశారు. అలాంటి వారిని ఇప్పుడు కన్సల్టెన్సీలు వెతుకుతున్నాయి. 
పేరుకు మాత్రమే..
ఈ నెల 30 నుంచి ఎంసెట్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రారంభం కానుండటంతో ఆలోగా తనిఖీలు పూర్తిచేసి కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో అధికారులున్నారు. దీంతో ప్రతిరోజూ10 నుంచి 18 కాలేజీల్లో తనిఖీలు చేసేందుకు టీమ్​లను ఏర్పాటు చేశారు. అయితే ఈ తనిఖీలన్నీ నామమాత్రంగా ఉంటాయని ఫ్యాకల్టీ చెప్తున్నారు. గురువారం జరిగిన పలు కాలేజీల తనిఖీల్లో సిబ్బందితో అధికారులు మాట్లాడలేదనే వాదనలున్నాయి. చాలా కాలేజీల్లో ఇప్పటికీ నెలల తరబడి జీతాలు పెండింగ్​లో ఉన్నాయి. వీటిపై జేఎన్టీయూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మేనేజ్​మెంట్లు చెప్పిందే విని, వారిచ్చే కవర్లు తీసుకొని వస్తున్నారని లెక్చరర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు పెద్దలు తనిఖీలు సక్రమంగా జరిగేలా చూసి, ఫ్యాకల్టీ జీతాల అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని కోరుతున్నారు.