కస్తూర్బా స్కూల్​లో ఫుడ్ పాయిజన్​.. వంద మంది స్టూడెంట్లకు అస్వస్థత

కస్తూర్బా స్కూల్​లో ఫుడ్ పాయిజన్​.. వంద మంది స్టూడెంట్లకు అస్వస్థత

మోర్తాడ్, వెలుగు: నిజామాబాద్​జిల్లా భీమ్​గల్ లోని కస్తూర్బా స్కూల్​లో ఫుడ్​పాయిజన్​కావడంతో వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి స్కూల్​ని 304 మంది స్టూడెంట్లు అన్నం తిని పడుకున్నారు. అర్ధరాత్రి తర్వాత కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించిన సిబ్బంది స్థానికంగా ఉన్న హాస్పిటల్ తరలించారు.

కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన ట్రీట్​మెంట్​కోసం 80 మందిని నిజామాబాద్ జిల్లా హాస్పిటల్​కు తరలించారు. మిగతా 20 మంది భీంగల్ లోనే ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. స్కూల్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, భోజనంలో క్వాలిటీ లోపించడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ పక్కనే భీంగల్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఉండడంతో స్కూల్ లోకి దోమలు, ఈగలు వస్తున్నాయని చెబుతున్నారు.

విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లిదండ్రుల తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. ఘటనపై ఎంక్వైరీ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో స్వామి తెలిపారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంగళవారం హాస్టల్ పరిసరాలను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.  కిచెన్, తదితర ప్రాంతాలను క్లీన్​చేశారు.