
పోతిరెడ్డిపాడు ద్వారా వంద టీఎంసీలు తీసుకెళ్లారు
రోజూ 44 వేల క్యూసెక్కులు తరలిస్తున్న ఏపీ
మిగతా కాల్వల ద్వారా ఇప్పటికే 50 టీఎంసీల వినియోగం
10 వేల క్యూసెక్కులకు మించని తెలంగాణ లిఫ్టులు
ఇప్పటివరకు రాష్ట్రం లిఫ్ట్ చేసిన వరద నీళ్లు 37 టీఎంసీలే
హైదరాబాద్, వెలుగు బ్యూరో: కృష్ణా నదిలో తమ వాటా మేరకు నీటి వినియోగంలో ఏపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల రెండో వారం నుంచి ఇప్పటివరకు అంటే నెలా పది రోజుల్లోనే 150 టీఎంసీలకుపైగా వాడుకుంది. పోతిరెడ్డిపాడు ద్వారా రోజూ 33 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల వరకు నీళ్లు తీసుకుంటోంది. దీనిద్వారానే ఇప్పటిదాకా 100 టీఎంసీలకుపైగా తరలించగా.. మిగతా కాల్వల నుంచి మరో 50 టీఎంసీల నీళ్లు వినియోగించుకుంది. ఇదే సమయంలో మొత్తంగా మన రాష్ట్రం వినియోగించుకున్న వరద నీళ్లు 37 టీఎంసీలే. నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశమున్నా నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేవని అధికారులు చెప్తున్నారు.
మొత్తంగా కృష్ణాలో ఏపీకి కేటాయింపులు 512 టీఎంసీలు, అందులో రాయలసీమకు 110 టీఎంసీల కేటాయింపు ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి వీలైనన్ని ఎక్కువ నీళ్లు తీసుకోవాలని ఏపీ సీఎం సూచించడంతో ఏపీ ఇంజనీర్లు పోతిరెడ్డిపాడు నుంచి వరుసగా రిజర్వాయర్లు నింపుకొంటున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా వివిధ రిజర్వాయర్లకు భారీగా నీరు చేరుతున్నది. వాటితో పాటు పెన్నా బేసిన్ కు కూడా ఈ నీటిని తరలిస్తున్నారు. వచ్చే ఏడాది వరద రాకున్నా ఇబ్బంది తలెత్తని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్తవానికి రాయలసీమకు కేటాయించిన నీళ్ల వాటా ఇప్పటికే తరలించేశారు. ఇలాగే కొనసాగితే నెలాఖరు వరకు ఒక్క పోతిరెడ్డి పాడు నుంచే 150 టీఎంసీల నీళ్లు రాయలసీమకు చేరుతాయని అంచనా. పోతిరెడ్డిపాడు ద్వారా కేటాయింపులకు మించి నీటిని తరలిస్తున్నారని తెలంగాణ ఇంజనీర్లు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
పోతిరెడ్డిపాడు దగ్గర ఏర్పాటు చేసిన టెలిమెట్రీలను పరిశీలించే అవకాశం కూడా మన ఇంజనీర్లకు లేకుండా పోయింది. వరద వచ్చిన సమయంలో తరలించే నీటిని వాటా కింద చూడొద్దని, కేవలం వరద నీటి సద్వినియోగంగా పరిగణించాలని ఏపీ ఇంజనీర్లు కృష్ణా బోర్డుకు లేఖ రాయడం గమనార్హం. తాము రోజుకు 25 వేల క్యూసెక్కులే డ్రా చేస్తున్నామని ఏపీ ఇంజనీర్లు చెప్తున్నారు. కానీ 44 వేల క్యూసెక్కుల చొప్పున తీసుకెళ్తున్నారు. అంతేకాదు నీటి తరలింపు కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా నదిలో రెండుసార్లు భారీగా వరదొచ్చినా మన రాష్ట్రం ఇప్పటివరకు అన్ని లిఫ్టుల కింద ఎత్తిపోసిన నీళ్లు 37 టీఎంసీలు మాత్రమే. ఇందులో నెట్టెంపాడుకు 6 టీఎంసీ లు. భీమా లిఫ్ట్ (ఫస్ట్ఫేజ్) కింద 4.423 టీఎంసీలు, భీమా రెండో లిఫ్ట్ కింద 3.984 టీఎంసీలు, కోయిల్ సాగర్ రెండో లిఫ్ట్ కింద 2.106 టీఎంసీలు, ఏఎమ్మార్పీ నుంచి 11.612 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్ నుంచి 9.476 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా మార్చి నెల దాకా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రాష్ట్ర ఇంజనీర్లు చెప్తున్నారు.
ఎక్కువ నీటిని లిఫ్టు చేసి, నిల్వ చేసుకునేందుకు మనకు తగినన్ని రిజర్వాయర్లు లేవని వారు అంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతోనే వరద నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోయిందని, అవి పూర్తయి ఉంటే ఏపీ తరహాలో నీళ్లు వినియోగించుకునే వీలుండేదని ఇంజనీర్లు చెప్తున్నారు.