25 మంది ఓటర్లకో ఇన్​చార్జ్​.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు బీజేపీ ప్లాన్

25 మంది ఓటర్లకో ఇన్​చార్జ్​.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు బీజేపీ ప్లాన్
  • వారిని పోలింగ్​ బూత్​కు రప్పించడంపై బీజేపీ నజర్​
  • ‘గ్రాడ్యుయేట్​’ ఎన్నికల్లో గెలుపుకు పార్టీ నేతల కసరత్తు
  • సర్కారుపై వ్యతిరేకత వరంగల్​లో కలిసివస్తుందన్న ధీమా

హైదరాబాద్​, వెలుగు: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. మామూలు ఎన్నికలకు ఇవి భిన్నమైనవి కావడంతో.. ప్రచారంతో పాటు ఓటర్లపైనా ఫోకస్​ పెట్టింది. వాళ్లను పోలింగ్​ కేంద్రాలకు రప్పించడమే కీలకమని భావిస్తోంది. కొద్ది రోజుల కిందట ప్రచారం కోసం వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ కూడా.. పార్టీ రాష్ట్ర నేతలకు ఇదే విషయాన్ని చెప్పారు. ఓటర్లను పోలింగ్​ బూత్​ వద్దకు రప్పిండమే లక్ష్యంగా 25 మంది ఓటర్లకో ఇన్​చార్జ్​ను పార్టీ నియమించింది. ఎప్పటికప్పుడు వారితో ఆ ఇన్​చార్జ్​ టచ్​లో ఉంటూ పోలింగ్​బూత్​ వరకు తీసుకొచ్చి ఓటేయించే బాధ్యతలను అప్పగించింది. బీజేపీకి మద్దతుగా ఓటర్లను కూడగట్టేందుకు సంఘ్​ పరివార్​ కూడా బరిలోకి దిగింది. ఆరెస్సెస్​, వీహెచ్​పీ, బజరంగ్​దళ్​, హిందూ వాహిని, పలు అనుబంధ సంస్థలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.

వరంగల్​ను దక్కించుకోవాలని..

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల జోష్​లో ఉన్న బీజేపీ.. ఇప్పుడు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్​ హైదరాబాద్​స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు వరంగల్​నూ గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో వరంగల్​లో బీజేపీకి రెండో స్థానం దక్కింది. అప్పుడు పరిస్థితులన్నీ టీఆర్​ఎస్​కే అనుకూలంగా ఉన్నాయని, దాని వల్లే రెండో స్థానంలో నిలిచామని పార్టీ నేతలు అంటున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని, కేసీఆర్​ సర్కార్​పై చదువుకున్నోళ్లు, ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్​ ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అదే తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​, సీనియర్​ నేతలు వివేక్​ వెంకటస్వామి, లక్ష్మణ్​, జితేందర్​​రెడ్డి, ఎమ్మెల్యేలు రాజాసింగ్​, రఘునందన్​​రావులు హైదరాబాద్​, వరంగల్​లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్​లో గెలుస్తామన్న ధీమాతో ఉన్న నేతలు.. కొంచెం కష్టపడితే వరంగల్​లోనూ గెలవొచ్చని భావిస్తున్నారు.