ఎంఐఎం వల్ల బీజేపీకి మేలన్నది అబద్దపు ప్రచారం: ఒవైసీ

ఎంఐఎం వల్ల బీజేపీకి మేలన్నది అబద్దపు ప్రచారం: ఒవైసీ

ఎంఐఎం హైదరాబాద్ కే పరిమితమని, ఇది ముస్లింల పార్టీ అని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తమ పార్టీ భారత్ అంతా ఉందని, ఇండియన్స్ అందరికీ చెందిన పార్టీ తమదని చెప్పారు. తన తండ్రి కాలం నుంచే కామారెడ్డిలో ఎంఐఎం ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎంకి ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక గూటి పక్షులేనని అన్నారు. కామారెడ్డి జిల్లాలో నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ నిర్వహించిన ఒవైసీ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు.

తనకు ఇద్దరు భార్యలున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించడంపై వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఒకరితోనే పరేషాన్ అవుతున్నానని, ఇంకా రెండో భార్యనా అంటూ సెటైర్లు వేశారు. నిజంగా రెండో భార్య ఉందని నిరూపించి, తనకు చూపిస్తే వారికి రివార్డ్ ఇస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ఒక తాను ముక్కలేనని అన్నారు. సీఏఏ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికిన శివసేనతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకుంటోందని అన్నారు. ఇటువంటి పార్టీకి ఎంఐఎంను విమర్శించే అర్హత లేదన్నారు. తన కుటుంబాన్ని, తననూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. ఎంఐఎంను బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ ఆరోపించడాన్నీ ఆయన తప్పుబట్టారు. తాము పోటీ చేయడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతోందన్న ప్రచారం అవాస్తవమని, తమ వల్లే బీహార్లోని కిసాన్ గంజ్ లో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి ఓడిపోయారని గుర్తు చేశారు.