కేసీఆర్ పాలనలో హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల భూములు స్వాహా

కేసీఆర్ పాలనలో హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల భూములు స్వాహా

హైదరాబాద్, వెలుగు:  గత బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంతా కాదు. అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరికినట్లు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టారు. ధరణిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల విలువైన సర్కారు ల్యాండ్స్​ను అప్పనంగా తమ పేర్ల మీదికి, తమ అనుచరుల పేర్ల మీదికి, తమ బినామీలైన ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదికి బదలాయించుకున్నారు. కోర్టు కేసులు నడుస్తున్న భూములను, భూదాన్ భూములను కూడా వదల్లేదు. ఒక్క గచ్చిబౌలి ఏరియాలోనే రూ. 57వేల కోట్ల విలువైన భూములను బీఆర్​ఎస్​ లీడర్లు పొతం పెట్టారు. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ చుట్టుపక్కల ప్రభుత్వ జాగా ఎక్కడ ఖాళీగా కనిపించినా దానిపై కన్నేసి.. తమ ఖాతాల్లో వేసుకున్నారు. రిటైర్డ్​ ఐఏఎస్​ల టీమ్​ ఎంక్వైరీలో ఈ నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి.  భూదందాలో బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు బయటపడింది. ఈ తతంగాన్నంతా కొందరు కలెక్టర్లు, ఉన్నతాధికారులు దగ్గరుండి నడిపించినట్లు వెల్లడైంది. గవర్నమెంట్​ భూముల కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్​ ప్రభుత్వానికి రిటైర్డ్​ ఐఏఎస్​ల టీమ్​ రిపోర్టు అందజేయగా.. విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసలు గుట్టు విప్పేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్​ చుట్టుపక్కలనే కాకుండా జిల్లాల్లోనూ జరిగిన భూ కుంభకోణాలను తేల్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. 

హైదరాబాద్​ చుట్టూ ఇదీ దందా..!

  • హైదరాబాద్​ శివారు శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెం. 63లో రూ. 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల (ఎకరా రూ. 50 కోట్ల వరకు పలుకుతున్నది) భూమి శేత్వార్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్​గా చూపిస్తుండగా.. పట్టా ల్యాండ్​గా కన్వర్ట్ చేశారు. 
  • ఇదే మండలం గోపన్​పల్లి  సర్వే నంబర్ 124లోని ల్యాండ్​ ప్రభుత్వ భూమిగా చూపిస్తుండగా.. 124/10, 11 సర్వే నెంబర్లోని 50 ఎకరాలను (ఎకరా రూ.40 కోట్లు) పట్టాగా మార్చేశారు.  
  • శంకర్​పల్లి మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నెం. 186, 187 లోని 20 ఎకరాల (ఎకరా రూ. 20 కోట్లు) భూదాన్ భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులకు అధికారులు పట్టాలు చేశారు.
  • గండిపేట్​ మండలం ఖానాపూర్​లోని బిలా దాఖల భూములకు సర్వే నంబర్ సృష్టించి 150 ఎకరాలను ఓ రిసార్ట్​కు పట్టా చేశారు.
  •  మియాపూర్​లోని సర్వే నెం. 69లో గల 27 ఎకరాల భూమి (ఎకరా రూ. 50 కోట్లు), గచ్చిబౌలిలోని సర్వే నెం. 38 నుంచి 54లో గల 76 ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ ప్లస్ భూమిని (ఎకరా రూ. 50 కోట్లు) ఐదు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. 
  • మహేశ్వరం, తుమ్మలూరు గ్రామాల మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని (ఎకరా రూ. 3 కోట్లు) నాటి ఓ మంత్రి  బినామీ పేరిట పట్టా చేశారు.
  • శేరిలింగంపల్లి గ్రామంలోని సర్వే నంబర్​ 90, 91 నుంచి 102 వరకు ఉన్న 110 ఎకరాలు (ఎకరా రూ. 50 కోట్లు), మాదాపూర్ లోని సర్వే నంబర్​ 68, 64లో గల ఐదెకరాలు (ఎకరా రూ. 60 కోట్లు), హఫీజ్ పేటలోని సర్వే నంబర్​ 80, కొండాపూర్​లోని సర్వే నంబర్​ 87, 88లో గల 10 ఎకరాల (ఎకరా రూ. 50 కోట్లు) భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.  మోకిల, కొండకల్ గ్రామాల మధ్యలో ఉన్న ల్యాండ్స్​కు కొత్తగా 555 సర్వే నంబర్​ను క్రియేట్ చేసి 150 ఎకరాలు (ఎకరా రూ. 30 కోట్లు) కూడా ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.