జీవనశైలికి కాదు..జీవితానికి విలువ ఇవ్వాలి

జీవనశైలికి కాదు..జీవితానికి విలువ ఇవ్వాలి

విపత్కర పరిస్థితుల్లో మనం మనపైనే దృష్టి నిలిపి.. స్వార్థంతో వ్యవహరించేలా చూడకుండా ఉంచడంలో ఆధ్యాత్మికత(స్పిరిట్యువాలిటీ) ఎంతో దోహదపడుతుంది. ఇది మన చుట్టు ఉన్న వాతావరణంలో పుష్కలంగా ఉంది. ఆధ్యాత్మిక భావనతో జీవించడం అంటే సన్యాసిలా మారడం లేదా ఒంటరిగా ఉండటం కాదు. మనం ఎవరం?  ఏం చేస్తున్నామనే విషయాలను లోతుగా గ్రహించి తదనుగుణంగా జీవించడం. ఆధ్యాత్మికత అంటే మనస్సును సదా తెరిచి ఉంచి జ్ఞానాన్ని ఎల్లవేళలా అందుకునేలా చూడటం. నిత్యాన్వేషకుడిగా ఉండాలంటే ఆధ్యాత్మికతను కలిగి ఉండాలి. 

ఈ సువిశాల విశ్వంలో మనం చిన్న రేణువులమే అన్నది యధార్థం. ఒక వ్యక్తిగా ఈ విస్తృత భూప్రపంచంలో మనం అనామకులం. ఈ వాస్తవాన్ని గ్రహించి మనలోని అజ్ఞాన, అహంకారాలను పారదోలాలి. మనల్ని ప్రభావితం చేసే ప్రతీ విషయాన్ని మనం మన మేధాస్సు, శక్తి, ధనబలం, కండబలంతో నియంత్రించుకోగలమనే భావన ఏర్పడటానికి కారణం మనలో ఆధ్యాత్మిక భావన లోపించడమే. ఈ ప్రపంచంలో మానవజాతే ఉన్నతమని “గొప్పగా ఆలోచిస్తామని భావించే తెలివైనవాళ్లు” మనల్ని నమ్మిస్తూ వచ్చారు. ఆహార వ్యవస్థలో పైచేయి సాధించేందుకు మనం హింసాత్మక, అసహజమైన విధానాలు అనుసరిస్తూ వస్తున్నాం. మన మనుగడకు ఏదీ సవాల్ విసరలేదని, భయపెట్టలేదన్నది మన తప్పుడు భావన.

ఈ భూమి మనుషులు ఒక్కరిదే కాదు

ఈ భూగ్రహం ఒక్క మానవ జాతికి మాత్రమే చెందింది కాదు. ఈ సృష్టిలో అనంతకోటి జీవరాశులున్నాయి. తెలియకుండానైనా సరే ఈ భూగ్రహాన్ని ఒకే జీవజాతితో నింపి మిగిలిన జీవజాలాన్ని సంహరిస్తే ఇది నిలబడగలుగుతుందా? ఆధునిక పారిశ్రామిక సమాజాలు ఉద్భవించకముందు, మానవుల్లో అంతులేని అత్యాశ చొరబడకముందు, మానవ సమాజాలన్నీ ప్రకృతితో మమేకమై ఇతర జీవజాతులతో కలిసి మనుగడ సాగించాయి. ఆధ్యాత్మిక భావజాలం కలిగిన ఆ సమాజాల్లో అవసరాలు తక్కువే. ఆశ తక్కువే. ఎటువంటి వ్యాధులు ఉండేవి కావు. అప్పట్లో రెండు, మూడు రెట్లు ఎక్కువ ఏండ్లు జనం జీవించేవారు. సహజ మరణాలను స్వాగతించేవారు. వాటిని వేడుకగా చేసుకునేవారు. ఈ భూగ్రహ వాతావరణాన్ని పూర్తిగా మన నియంత్రణలో పెట్టుకోలేమనే విషయాన్ని మనమంతా ఆలోచించాల్సిన సమయమిది. ఈ భూగ్రహంపై ఎన్నో సహజ శక్తులు ఉన్నాయి. వాటన్నింటినీ మనం ఎదిరించలేం. కానీ, అదే సమయంలో వ్యాధులు, పర్యావరణ హెచ్చరికలు, ఇతర అస్తిత్వ బెదిరింపులను తట్టుకుంటూ మానవ జాతి ఎన్నో ప్రభావవంతమైన చర్యలు చేపడుతూ మనుగడను పదిలపరుచుకుంటోంది.

ఆత్మపరిశీలన చేసుకోవాలి

బలవంతంగానో, స్వచ్ఛందంగానో మనం ఇండ్లలో బందీలుగా మారిపోయిన ప్రస్తుత సమయంలో మానవులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయంలో లోతైన ఆత్మపరిశీలన చేసుకోవాలి. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి, ఆలోచనల వికాసంతో నిజంగా మనం పురోగతి సాధించామా లేదా తిరోగమనంలో పడ్డామా? విజయాలు, పురోగతి, అభివృద్ధి, సంపదను మన అసహజ చర్యలకు అనుగుణంగా నిర్వచనం చెప్పుకున్నామా? ఈ క్రమంలో దిగువ పేర్కొన్న మూడు అంశాలను గుర్తించి, ప్రతిశోధించి, పరిష్కరించాలని సమస్త మానవజాతికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రకృతితో తిరిగి మమేకమవడం

ఈ భూమిపై జీవితమన్నది అద్భుతమైన సహజ సృష్టి. వాతావరణంలో ప్రాణాధార వాయువులను నింపి జీవజాతిని ప్రకృతి ఎలా పరిరక్షిస్తుందో చూడటం ఎప్పటికీ అంతుచిక్కని విషయమే. కానీ, మానవజాతి తన సహజ ధోరణి నుంచి ఉన్మాదంతో ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. కాంక్రీట్, కృత్రిమమైన, రణగొణధ్వనులు, ఇరుకు గదుల్లో మనుషులు సౌకర్యంగా ఉండటం ఒకింత అసహజంగా కనిపిస్తోంది. సహజ వాతావరణంతో పోల్చితే కాంక్రీట్ ఆవాసాల్లో మనం స్వేచ్ఛగా గాలి పీల్చలేకపోవడమే కాదు మంచి జీవన అనుభూతిని పొందలేకపోతున్నాం. ప్రకృతి మనకు పీల్చుకునేందుకు అంతులేని ప్రాణవాయువును అందిస్తుండటంతో సరిగ్గా శ్వాసించాలనే విషయాన్ని కూడా మనం మర్చిపోయాం. భౌతిక సుఖాల కోసం ప్రాథమిక జీవన విధులను మనం చాలా తక్కువగా తీసుకుంటున్నాం. శతాబ్దాలుగా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా మసలుకుంటున్నాం.గడిచిన 500 ఏండ్లుగా మనం ప్రకృతి సంపదను ఇష్టారీతిన వాడుకున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్రకృతి ఆవాసాలకు తిరిగి వెళ్లడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. చక్కగా జీవించేందుకు, చక్కగా శ్వాసించేందుకు, రోగాలు బారిన పడకుండా హాయిగా ఉండేందుకు మనకు ఒక దారి దొరికితే బాగుండని నేను కోరుకుంటున్నాను.

మన అవసరాలను తగ్గించుకోవాలి

సమాజంలో అత్యాశను తగ్గించాలంటే ముందు మన అవసరాలను తగ్గించుకోవాలి. నియంత్రించలేకపోతున్న ఒత్తిడి, అసంబద్ధమైన ప్రాధాన్యతలు, అనవసర పోలికలు, అనారోగ్యకరమైన పోటీకి కారణం మనిషిలోని అత్యాశే. సంపదకన్నా ఆరోగ్యం మిన్న, విజయం కన్నా సంతోషం మిన్న, ప్రతిచర్య కన్నా పరిశీలన మిన్న, ఔషధాల కన్నా పోషకాలు మిన్న, భౌతికవాదం కన్నా ఆధ్యాత్మికత మిన్న అనే జీవన పరిజ్ఞానాన్ని మర్చిపోయి సంకుచిత మనస్తత్వంతో మానవ సమాజం జీవిస్తోంది. ఆరోగ్యపరంగా మనిషికి కరోనా మొదటి సవాల్ కాదు, అదే చివరిది కాబోదు. మనం ప్రస్తుతం నివస్తున్న సంక్లిష్టమైన ఆధునిక ఆవాసాల కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నిజంగా మనం మన జీవితాలను సంపూర్ణ ఆనందంతో, ఆధ్యాత్మిక కోణంతో జీవించినట్టు అయితే చీమల పుట్టల్లాంటి నగర జీవితాన్ని దూరంగా పెట్టేవాళ్లం.

ఆధ్యాత్మిక సమాజాన్ని నెలకొల్పుదాం

ఆధ్యాత్మికత అన్నది పురాతన నాగరిక జ్ఞాన సంపద. జీవించేందుకు అది ఒక మహోన్నతమైన మార్గం. నిజంగా ఎవరైనా జీవితానికి విలువ ఇస్తే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి. దానికి విలువ ఇవ్వాలి. ఆధునిక సమాజంలో వ్యక్తిగత విజయాలు, సంపద సృష్టి, శాస్త్రీయ పురోగతి, సాంకేతిక అభివృద్ధిని స్వాగతించాల్సిందే. కానీ అవి మన సహజ అలవాట్లు, ఆవాసాలను వినాశనం చేసుకుంటూ కాదు. ప్రగతి, పరిణామం, అభివృద్ధి పేరుతో ఈ విశ్వం, ఈ గ్రహం నుంచి పక్కదారి పట్టాల్సిన అవసరం లేదు. ఈ గ్రహంపై జీవించబోయే చివరి తరం మనుషులం మనమే అన్న ధోరణిలో జీవించడం మూర్ఖత్వం. మన విలువైన జీవితం, స్పృహతో శ్వాసించడం, సహజ వాతావరణాన్ని గౌరవించడం, ప్రకృతిలోని అపార సంపదపై కృతజ్ఞత, ఇతర జీవరాశులపై సానుభూతి, ప్రకృతిలోని ఇతర అంశాలతో మమేకమవుతూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటేనే భవిష్యత్​లో మానవ మనుగడ ఉంటుంది. 

కరోనా ఒక చెంపదెబ్బలాంటిది

పారిశ్రామిక, కృత్రిమమైన, జటిలమైన సమాజాల్లో జీవిస్తున్న మానవులకు చెంపదెబ్బ వంటిది కరోనా. 0.06 మైక్రాన్ల నుంచి 1.4 మైక్రాన్లు మాత్రమే ఉండే ఒక అత్యంత సూక్ష్మక్రిమి ఇప్పుడు మనిషికి సవాల్ విసురుతోంది. గొప్పవని భావించే తెలివితేటలు, అధికారం, పర్యావరణంపై మనకుందని భావించే నియంత్రణ అన్ని కూడా కరోనా ముందు పనికిరాకుండా పోయాయి. 15 నెలలు గడిచినా ఇప్పటికీ సందేహాలకు తావులేని వైద్యాన్ని, వ్యాక్సిన్​ను కనుగొనలేకపోయాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనా ఫలితాల్లో గందరగోళం, పోటీ, తిరస్కరణలు, ఉపసంహరణలే కనిపిస్తున్నాయి. నిజంగా మనది ఉన్నతశ్రేణి జాతి అయితే ఒక సూక్ష్మక్రిమి ముందు ఎందుకు బేలగా నిల్చుంటున్నాం? ఈ మహమ్మారికి మన తోటి మానవులు 35 లక్షల మందిని ఎలా బలిస్తాం? 
‑ కె.కృష్ణసాగర్ రావు
బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి