ఒకే దేశం-ఒకే ట్యాక్స్ ఇప్పుడు ఒకే దేశం-తొమ్మిది ట్యాక్సులుగా మారింది: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

ఒకే దేశం-ఒకే ట్యాక్స్ ఇప్పుడు ఒకే దేశం-తొమ్మిది ట్యాక్సులుగా మారింది: కాంగ్రెస్ చీఫ్  మల్లికార్జున ఖర్గే

జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) స్లాబుల మార్పుపై కేంద్రంపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అనే నినాదం ఇప్పుడు వన్ నేషన్-నైన్ ట్యాక్స్ లుగా మారిందని గురువారం (సెప్టెంబర్ 04) అన్నారు. గత పదేళ్లుగా జీఎస్టీ సంస్కరణల కోసం కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతూ వస్తోందని.. కానీ ఏనాడూ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్ ను, సమాన్యుల ఇబ్బందులను పట్టించుకోలేదని విమర్శిచారు. 

ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్యర్యంలో జీఎస్టీ స్లాబులను తీసొచ్చారని.. 0%, 5%, 12%, 18%, 28% స్లాబులుగా ప్రవేశ పెట్టి సామాన్యుల నడ్డి విరుస్తూ వస్తున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. 2019, 2024 ఎన్నికల మేనిఫెస్టోలో జీఎస్టీ సంస్కరణల కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లు తెలిపారు. 2011 లో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును బీజేపీ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. 

GST 2.0 ద్వారా సింపుల్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకురావాలని 2019,24 మేనిఫెస్టోలో డిమాండ్ చేసినట్లు చెప్పిన ఖర్గే.. మోదీ ప్రభుత్వ విధానాలతో జీఎస్టీ భారంతో చిన్న మధ్యతరహా పరిశ్రమలు (MSMEs and small businesses) తీవ్ర ప్రభావానికి లోనైనట్లు చెప్పారు. 2005లో యూపీఏ-1 సందర్భంగా జీఎస్టీ బిల్లును రూపొందించి.. 2011 యూపీఏ -2 ప్రభుత్వ హయాంలో ప్రణబ్ ముఖర్జీ ప్రవేష పెట్టిన బిల్లును బీజేపీ వ్యతిరేకించిందని.. అప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్న మోదీ తీవ్రంగా వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. కానీ అదే మోదీ ప్రభాని అయ్యాక జీఎస్టీ రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరగ్గొట్టారని మండిపడ్డారు. 

సాధారణ ప్రజల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి.. జీఎస్టీ సంబరాలు చేసుకోవడం విడ్డూరం అని అన్నారు. దేశ చరిత్రలో మొట్ట మొదటి సారి రైతులపై పన్నులు విధించిన ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం నిలిచిందని విమర్శించారు. కనీసం 36 శాతం వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ విధించి.. రైతులకు భారం అయ్యేలా చేశారని దుయ్యబట్టారు. 

జీఎస్టీ ని గబ్బర్ సింగ్ ట్యాక్సీ అని కాంగ్రెస్ పార్టీ పిలుస్తోందని... నిత్యవసరాలైన పాలు, పెరుగు, పిండి, తిండి గింజలు.. చివరికి పిల్లల పెన్సిల్స్, బుక్స్, వీటికితో ఆస్పుత్రులలో ఆక్సిజెన్ సరఫరాకు కూడా జీఎస్టీ విధించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని మండిపడ్డారు.