
న్యూయార్క్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. తాను మొత్తం ఏడు యుద్ధాలను ఆపానని, అందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అన్నారు. శనివారం అమెరికన్ కార్నర్‌స్టోన్ ఇనిస్టిట్యూట్ ఫౌండర్స్ డిన్నర్ మీట్‌లో ట్రంప్ మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ వేదికపై అమెరికాకు ఇప్పుడు గౌరవం లభిస్తున్నదని ఆయన తెలిపారు.
‘‘మేం యుద్ధాలను ఆపుతున్నం. శాంతి ఒప్పందాలను కుదుర్చుతున్నం. ఇండియా, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను. ఇరుదేశాల లీడర్లను గౌరవిస్తాను. అవి రెండూ అణ్వాయుధ దేశాలు. మీరు యుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యం ఆపేస్తానని రెండు దేశాలను హెచ్చరించాను. దీంతో యుద్ధం ఆపేశాయి. భారత్, పాక్ లెక్కనే థాయ్‌లాండ్–కంబోడియా, అర్మేనియా–అజర్‌బైజాన్, కొసావో–సెర్బియా, ఇజ్రాయెల్–ఇరాన్, ఈజిప్ట్–ఇథియోపియా, రువాండా–కాంగో మధ్య యుద్ధాలను ఆపాను. ఇందులో 60 శాతం యుద్ధాలను వాణిజ్య బెదిరింపుల ద్వారానే ఆపగలిగాను” అని చెప్పారు.
‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపితే నోబెల్ వస్తుందని కొందరు నాతో అన్నారు. మరి ఇప్పటి వరకు నేను ఆపిన ఏడు యుద్ధాల సంగతేంటి? ఒక్కో దానికి ఒక్కో నోబెల్ ఇవ్వాలి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం పెద్దది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ యుద్ధాన్ని సులభంగానే ఆపవచ్చని నేను అనుకున్నాను. కానీ ఆయన నన్ను నిరాశ పరిచారు.. అయినా పర్లేదు. ఏదో ఒక విధంగా యుద్ధాన్ని ఆపుతాను” అని పేర్కొన్నారు.