
- పిల్లల్ని కనేందుకే పెళ్లట.. – అద్దంలో చూసుకుంటే టీనేజీ తెలుస్తదట
- 8, 9, 10 తరగతి TTSCERT పుస్తకాల్లో పాఠాలు గందరగోళం
హైదరాబాద్, వెలుగు: పిల్లలు ఎట్ల పుడతరు? పుట్టేటప్పుడు కొన్నిసార్లు తలే ఎందుకు ముందు బయటకొస్తది? పెళ్లంటే పిల్లల్ని కనేందుకేనా? ఇదిగో వీటిపై తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (టీఎస్‌సీఈఆర్‌టీ)కీ క్లారిటీ లేదు. అవును మరి, టీఎస్సీఆర్టీ తయారు చేయించిన పుస్తకాల్లో అదే ఉంది. అసలు వాటిపై సైన్స్‌కే క్లారిటీ లేదన్నట్టు రాసేశారు పాఠాలు. 8, 9, 10 తరగతుల బయాలజీ పుస్తకాల్లో ఈ తప్పులు బయటపడ్డాయి. టెన్త్ క్లాస్ బయాలజీ బుక్కులోని 126వ పేజీకెళ్దాం ఒకసారి. ఆ పేజీలో పిల్లలు ఎట్ల పుడతరు, చాలా సందర్భాల్లో తలే ఎందుకు ముందుకొస్తది అన్న వాటిపై రెండు ముక్కల్లో తేల్చేశారు. ‘‘అసలు పిల్లలు ఎలా పుడతారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో సైన్స్‌లోనే క్లారిటీ లేదు” అని పాఠంలో ఉంది. దీనిపైనే ఇప్పుడు విద్యా నిపుణులు గరం గరం అవుతున్నారు. సెక్స్, పునరుత్పత్తి (రిప్రొడక్షన్)లపై పిల్లలకు అవగాహన కల్పించడం మానేసి, ఇలాంటి తప్పులతో పిల్లలను ఇంకెక్కువ గందరగోళంలో పడేస్తున్నారని మండిపడుతున్నారు. నిజానికి 2014లోనే పిల్లల పుట్టుక గురించి టెన్త్‌లో పాఠం పెట్టారు. కానీ, దానిపై క్లారిటీ లేదని 2016లో ఆ పేజీని మార్చారు గానీ, ఆ తప్పును మాత్రం సరిదిద్దలేకపోయారు.
పిల్లల్ని కనేందుకే పెళ్లి
ఎనిమిదో తరగతి పుస్తకానికొద్దాం. బాల్య వివాహాలు సమాజానికి ఎంత చేటో చెప్పేలా ఓ పాఠం ఉంది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, పెళ్లి అనే దానికే నిర్వచనం మార్చేశారు. పిల్లల్ని కనేందుకే పెళ్లి అని తేల్చేశారు. అయితే, అలాంటి పెళ్లిని కావాల్సిన వయసు రాకముందే చేసేయడం మంచిది కాదు అని రాశారు. అంటే దేశం బాగుండేందుకు పిల్లల్ని కనేలా పెళ్లి చేసుకుంటూ ఉంటారని పాఠం రాయడం ఎంత వరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పునరుత్పత్తికి కారణమయ్యే ప్రతి అవవయవానికీ టెన్త్ క్లాస్ బయాలజీ బుక్కు 124వ పేజీలో స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. కానీ, స్త్రీ, పురుషుల మర్మావయవాలకు సంబంధించి మాత్రం చెప్పలేదు. వృషణాలు, మూత్రనాళాలు, అండాశయాలు, గర్భాశయం వంటి వాటి గురించి చెప్పి, వాటి పనులనూ చెప్పినప్పుడు, మర్మావయవాల గురించి మాత్రం ఎందుకు వదిలేసినట్టు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆ పదాలను పలకడం, రాయడం అంతా బాగుండదు అనుకుంటే కనీసం పిల్లలకు అర్థమయ్యేలా సులభమైన భాషలో చెప్పొచ్చు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కోడి ముందా.. గుడ్డు ముందా?
కోడి ముందా.. గుడ్డు ముందా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో జనాలు అప్పుడప్పుడు సరదాగా వేసుకునే ప్రశ్న. ఎనిమిదో తరగతి బుక్కులో మాత్రం దానికి క్లారిటీ ఇవ్వకుండానే ప్రశ్నలు సంధించి వదిలిపెట్టేశారు. గుడ్లన్నీ గూడులోనే పొదుగుతాయా? కోడి ముందా.. గుడ్డు ముందా? ఒకవేళ కోడి లేకపోతే గుడ్డు వస్తుందా? వంటి ప్రశ్నలు వాళ్లే వేశారు. మళ్లీ వాటికి సరైన సమాధానం చెప్పలేమంటూ వాళ్లే తేల్చేశారు. ఇటు టీనేజ్పైనా అలాంటి ప్రశ్నలే వేశారు పుస్తకాల్లో. మొహానికి తరచూ పౌడర్ అద్దుకుంటూ, జుట్టు దువ్వుకుంటున్నారా? ఎప్పుడూ అద్దంలో మొహం చూసుకుంటున్నారా? చిన్నప్పుడు తోటి వయసోళ్లు అయిన ఆపోజిట్ జెండర్ (అబ్బాయిలతో అమ్మాయిలు, అమ్మాయిలతో అబ్బాయిలు) వాళ్లతో ఆడుకోవాలనిపిస్తోందా? ఏదైనా పనిచేయాలని తల్లిదండ్రులు చెప్పినప్పుడు చేతకావట్లేదంటున్నారా? మీసాలొచ్చాయా? గొంతులో మార్పొచ్చిందా వంటి ప్రశ్నలు వేశారు. ఆ లక్షణాలేవీ లేకుంటే మీరింకా టీనేజ్‌లోకి రానట్టేనని తేల్చారు. స్పష్టంగా పాఠాలు చెప్పాల్సిందిపోయి ఇట్ల గందరగోళంలో పడేస్తారా అంటూ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
రాక్స్టార్లు..నీళ్లలో ఉప్పు తీసేశారట
రాక్స్టార్లు ఏం చేస్తారు? స్టేజీపై సాంగ్స్‌తో అలరిస్తుంటారు. కానీ, ఆ రాక్స్టార్లే నీళ్లలో ఉప్పును తొలగించే డీ శాలినేషన్ పద్ధతిని కనిపెట్టారట. ఈ తప్పు తొమ్మిదో తరగతి బుక్కులో దొర్లిన పెద్ద తప్పిది. ఫ్రెడ్డీ మెర్క్యురీ, డేవిడ్ బోవిలు పెద్ద మ్యూజిక్ స్టార్లు. వాళ్లే డీ శాలినేషన్ టెక్నిక్‌ను కనిపెట్టారని పాఠంలో రాశారు. బహుశా ఈ పాఠం చదివితే అసలు డీశాలినేషన్‌ను 1791లోనే కనిపెట్టిన అమెరికా సైంటిస్ట్ థామస్ జెఫర్సన్ ఆత్మ ఏమైపోతుందో ఏమో. జెఫర్సన్ పేరు ఎక్కడా రాకుండా ఫ్రెడ్డీ, బోవిలే డీశాలినేషన్‌ను కనిపెట్టారంటూ పాఠం రాసిన పది మంది పెద్ద సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నమూ చేశారు. సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సముద్రపు నీళ్లలోని ఉప్పును వాళ్లిద్దరూ తొలగించగలిగారని డెఫినేషన్ ఇచ్చారు. నిజానికి డీశాలినేషన్ ప్రాసెస్ ‘ప్రెజరైజేషన్’తో కూడిన టెక్నిక్ అని నిపుణులు చెబుతున్నారు.