- న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
- కరెంట్ తీగలు తగిలి
- కాగజ్‌నగర్ మండం పర్ధాన్గూడలో ఒకరు మృతి
- చెరువులో పడి మరొకరి దుర్మరణం
- జీడిమెట్లలో ఘటన
కాగజ్‌నగర్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల కోసం 31వ తేదీన అర్ధరాత్రి దోస్తులతో కలిసి దావత్ చేసుకునేందుకు వెళ్లిన స్టూడెంట్ అనుకోని రీతిలో వేటగాళ్లు అడవి జంతువుల కోసం పెట్టిన కరెంటు వైర్లకు తగిలి చనిపోయాడు. ఈ ఘటన కాగజ్ నగర్ మండలం పర్ధాన్ గూడ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. మండలంలోని కోసిని గ్రామానికి చెందిన ఆదె కృష్ణ, పోచు బాయిల కొడుకు విష్ణు(18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. శనివారం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా దోస్తులతో కలిసి పార్టీ చేసుకునేందుకు పర్ధాన్గూడ సమీపం లోని పంట పొలాల్లోకి వెళ్లాడు. రాత్రి కావడంతో సెల్ ఫోన్ వెలుగులో ముందుకు నడుస్తున్నారు. ఈ క్రమంలో ముందు నడుస్తున్న విష్ణు కాళ్లకు వేటగాళ్లు అడవి జంతువుల కోసం పెట్టిన కరెంటు వైర్లు తగిలాయి. దీంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసిన మిగిలిన ఫ్రెండ్స్భయం తో వెనక్కి తిరిగి వచ్చారు. పోలీసులకు చెప్పడంతో రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ సానియా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వేడుకలు చేసుకుని ఇంటికి వెళ్తూ..
జీడిమెట్ల : చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని నిజాంపేట రాజీవ్‌గృహకల్ప కాలనీకి చెందిన పీటర్(25) ఫ్రెండ్స్‌తో కలిసి శనివారం అర్ధరాత్రి వరకు న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. తర్వాత ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలనీకి సమీపంలోని చెరువులో పడి చనిపోయాడు. బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.