
శంకరపట్నం, వెలుగు: చేపలు పడుతూ వ్యక్తి చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం..శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామానికి చెందిన కొల్లూరి చంద్రమౌళి(57), సరమ్మ దంపతులు శుక్రవారం తమ పొలం వద్దకు వెళ్లారు. సమీపంలోని చింతకుంటలో చేపలు పట్టేందుకు చంద్రమౌళి వెళ్లాడు. నీటిలోకి దిగి చేపలు పడుతుండగా లోతైన బురద గుంతలో మునిగిపోయాడు.
సరమ్మ, కొందరు స్థానికులు కలిసి చీరతో అతడిని లాగుతూ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీటిలో ఊపిరాడక అతడు చనిపోయాడు. దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కేశవపట్నం ఎస్ఐ రవి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.