సీడబ్ల్యూసీలో చోటెవరికి!

సీడబ్ల్యూసీలో చోటెవరికి!

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో రాష్ట్రం నుంచి ఒకరికి అవకాశం దక్కనుంది. చాలా మంది సీనియర్లు చోటు కోసం పోటీ పడుతున్నారు. ఈసారి కుల సమీకరణాలు, మహిళలకు చాన్స్​ వంటి అంశాలను హైకమాండ్​ పరిగణనలోకి తీసుకుంటున్నది. ఆ దిశగా తీర్మానం కూడా చేసింది.  

కాస్ట్ ఈక్వేషన్స్

రాష్ట్రం నుంచి 8 మంది నేతల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఎస్సీల నుంచి సంపత్​, దామోదర రాజనర్సింహ, ఎస్టీల నుంచి సీతక్క, బలరాం నాయక్, బీసీల్లో పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. కమిటీలో 50 శాతం మహిళలకు కేటాయించాలని తీర్మానించిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి సీతక్కను కమిటీలో తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ సీనియర్లకు అవకాశం ఇవ్వాలనుకుంటే వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్ వంటి వారి పేర్లను పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 

రూల్స్ అండ్​ రెగ్యులేషన్స్​లో మార్పు

ఇటీవల సీడబ్ల్యూసీ  రూల్స్ అండ్​ రెగ్యులేషన్స్​ను కాంగ్రెస్​ హైకమాండ్ మార్చింది.  కమిటీలో ఉండాలనుకునే సభ్యులెవరూ డ్రగ్స్ వాడి ఉండకూడదని, మద్యం సేవించకూడదని కొత్త రూల్ తీసుకొచ్చింది. సభ్యుల సంఖ్యను 35కు పెంచింది. ఈనేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఆ కమిటీలో చోటు సంపాదించాలనుకునే ఆశావహుల సంఖ్య పెరిగింది.

ఇదివరకు ఒక్కరికే..

గతంలో తెలంగాణ నుంచి కె.కేశవరావును సీడబ్ల్యూసీలోకి హైకమాండ్ తీసుకుంది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్​లో చేరారు. ఆయన తర్వాత తెలంగాణ నుంచి మరెవరికి సీడబ్ల్యూసీలో చోటు దక్కలేదు. ప్రస్తుతం కమిటీలో 23 మంది సభ్యులుండగా.. 12 మంది ఎలెక్టెడ్, 11 మంది నామినేటెడ్ సభ్యులున్నారు. తాజాగా మరో 12 మందిని కమిటీలోకి నామినేటెడ్ సభ్యులుగా తీసుకోనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎవరిని తెలంగాణ నుంచి నామినేట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.