ఆన్లైన్ బెట్టింగ్లో 7 లక్షలు పోగొట్టుకొని..

ఆన్లైన్ బెట్టింగ్లో 7 లక్షలు పోగొట్టుకొని..

రంగారెడ్డి జిల్లా  : రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక.. సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి  ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో జరిగింది. కర్ణాటకకు చెందిన దత్తాత్రేయ గత 4 నెలలుగా అత్తాపూర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆన్ లైన్ గేమ్ యాప్ ‘పరిమ్యాచ్’ లో బెట్టింగ్ కు అలవాటు పడి.. 2 ఏళ్లుగా ఆన్ లైన్ లో బెట్టింగ్ చేస్తూ దాదాపు రూ.6 – 7 లక్షలు పోగొట్టుకున్నాడు.  తనకున్న 3 క్రెడిట్ కార్డులు (SBI, కోటాక్, RBL), 2 ఆన్ లైన్ లోన్ యాప్ ల (మై మనీ వ్యూ, క్రెడ్) ద్వారా దాదాపు రూ.1.70 లక్షలు అప్పు తీసుకుని .. అవి కూడా ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టాడు.

తిరిగి కట్టాలని ఒత్తిడి..

సరైన సమయానికి అప్పు చెల్లించకపోవడంతో..  వడ్డీతో సహా మొత్తం అప్పు తిరిగి కట్టాలని గత కొన్ని నెలలుగా క్రెడిట్ కార్డులు, ఆన్ లైన్ యాప్ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే స్థితిలో లేకపోవడం, కుటుంబాన్ని పోషించే స్థోమత లేదనే ఆవేదనతో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే దత్తాత్రేయ ఉరి వేసుకున్నాడు. ఇంటి యజమాని, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ రాసి ఉండడంతో,  దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.