- ప్రభుత్వ అనుమతి కోసం ఎల్లుండి స్టాండింగ్ కమిటీ ముందుకు ప్రపోజల్స్
- పలు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు 141 ఆస్తుల సేకరణ ప్రతిపాదనలు
- మాన్సూన్ టీమ్స్ కోసం హైడ్రాకు రూ.20 కోట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘వన్ టైమ్ సెటిల్మెంట్’(ఓటీఎస్) స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనలు శుక్రవారం జరిగే స్టాండింగ్ కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది. ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలను రాబట్టేందుకు ప్రతిఏటా అమలు చేస్తున్న ఓటీఎస్ ను ఈసారి కూడా అంబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఓటీఎస్ కింద వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు.
ఈ స్కీమ్ తో ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో హైడ్రా వద్ద పనిచేసిన 5 కేటగిరీలకు సంబంధించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలల జీతాలు నెలకు రూ.35,11,950 చొప్పున మొత్తం రూ.1,05,35,850 విడుదల చేయడంతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, యంత్రాల కొనుగోలు కోసం హైడ్రాకు రూ.20 కోట్లను వెంటనే విడుదల చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసం రానున్నట్లు తెలిసింది.
కమిటీ ముందుకు రానున్న ప్రధాన అంశాలు..
హెచ్ సిటీ కింద ప్రతిపాదిత 4 లేన్ల రసూల్‌పురా జంక్షన్ నిర్మాణం కోసం సవరించిన రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ ఆమోదం. దీని వెడల్పు 30 మీటర్లు కాగా, 15 మీటర్ల నుంచి 20.5 మీటర్ల వైడెనింగ్ కోసం ప్రతిపాదించిన విధంగా 26 ఆస్తులను సేకరించడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి ఆమోదం తీసుకోవడానికి -స్టాండింగ్ కమిటీ ముందుకు రానుంది.
హెచ్ సిటీలో భాగంగా ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రతిపాదిత ఫ్లైఓవర్, ఆర్‌ఓబి, ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం కోసం రెండు సెట్ల ఆర్డీపీల ఆమోదం కోసం, ఆర్కేపురం జంక్షన్ మినహా కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్డు వెడల్పులో భాగంగా 10 ఆస్తుల సేకరణకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి ఆమోదం.
మూసాపేట సర్కిల్ కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో కొంత భాగంలో ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీ ఏర్పాటుకు చేసేందుకు అనుమతి. రూ.5 కోట్లు మంజూరు.
చౌమహల్లా ప్యాలెస్ సమీపంలోని ఖిల్వత్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) పిలవడానికి ఆమోదం. అలాగే డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్(డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో 15 ఏళ్ల పాటు నిర్మాణం కోసం కమిటీ ఆమోదం.
హెచ్ సిటీ కింద రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి సంబంధించి పలు మార్పులను మాస్టర్ ప్లాన్‌లో చేర్చడానికి ప్రభుత్వానికి తెలియజేసి 106 ఆస్తులను సేకరించడం.
మాసబ్ ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్క్ స్పోర్ట్స్ ప్లేగ్రౌండ్‌ను స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ సాయిబాబా33 సంవత్సరాలుగా ఆక్రమించడంతో పాటు, లీజు ఫీజు చెల్లించకపోవడంపై నిర్ణయం.
ఫతేనగర్ నుంచి బల్కంపేట వెళ్లే ఫ్లైఓవర్, ఫతేనగర్ నుంచి సనత్ నగర్ వెళ్లే ఫ్లైఓవర్ల పునరుద్ధరణ పనుల కోసం రూ.12 కోట్ల పరిపాలన అనుమతుల మంజూరు.
చీఫ్ సిటీ ప్లానర్(సీసీపీ) ఓవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ నుంచి సంతోష్ నగర్ వైపు ప్రతిపాదిత లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంప్ నిర్మాణం కోసం రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ ఆమోదం. రోడ్డు వెడల్పు కోసం 7 ఆస్తుల సేకరణ అంశం.
