వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ మళ్లొస్తుంది!

వన్ టైమ్  సెటిల్ మెంట్ స్కీమ్ మళ్లొస్తుంది!
  • ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన జీహెచ్ఎంసీ
  • అనుమతులు వచ్చిన వెంటనే అమల్లోకి.. 
  • ఆదాయం పెంచేందుకు బల్దియా అధికారులు ప్లాన్
  • గ్రేటర్​పరిధిలో రూ.5 వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్​ బకాయిలు
  • ఓటీఎస్ ద్వారా రూ.500 కోట్లు వస్తాయని అంచనా

హైదరాబాద్, వెలుగు: వన్ టైమ్​సెటిల్ మెంట్ స్కీమ్(ఓటీఎస్)ను మరోసారి అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఓకే చెప్పిన వెంటనే ఓటీఎస్ అమల్లోకి రానుంది. మరో వారం రోజుల్లో ఓటీఎస్ ను అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు బల్దియా వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ ఆదాయం పడిపోవడంతోనే అధికారులు ఓటీఎస్ ను అమలు చేయాలని చూస్తున్నారు. 2020లో మొదటిసారి బల్దియాలో ఓటీఎస్ ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆదాయం తగ్గినప్పుడు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం బల్దియా ఖజానా ఖాళీగా ఉంది. దీంతో ఒక్కో నెలలో ఉద్యోగుల జీతాలు టైమ్ కు అందట్లేదు. అభివృద్ధి పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని స్థితిలో జీహెచ్ఎంసీ ఉందంటే ఆదాయం ఏమేర పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ అందిస్తూ ఓటీఎస్ ను అమలు చేయాలని అధికారులు చూస్తున్నారు. 10 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు.

గతంలో రెండు సార్లు అమలు

జీహెచ్ఎంసీలో ఇప్పటివరకు రెండుసార్లు వన్​టైమ్​సెటిల్​మెంట్​స్కీమ్​ను అమలు చేశారు. మొదటి సారి 2020 ఆగస్టు1 నుంచి నవంబర్ 15 వరకు, 2022 జులైలో రెండోసారి అమలు చేశారు. రెండు సార్లు కలిపి జీహెచ్ఎంసీకి రూ.700 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరోసారి అమలు చేస్తే రూ.500 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ లో ఆస్తి పన్ను బకాయిలు రూ.5 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉండగా, రూ.2 వేల కోట్లు ఆస్తి పన్ను దారుల నుంచి రావాల్సి ఉంది. ఓటీఎస్​ను అమలు చేస్తే బకాయిలు తగ్గడంతోపాటు, ఖజానా నిండుతుందని బల్దియా అధికారులు అంచనా వేస్తున్నారు. 

2 లక్షల మందికి లబ్ధి

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పెండింగ్​ప్రాపర్టీ ట్యాక్స్ ను వసూలు చేసేందుకు బల్దియా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సర్కార్​నుంచి పర్మిషన్ రాగానే ఓటీఎస్ ను అమలు చేయనుంది. నెలాఖరులోగా అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల నుంచి ఓటీఎస్​అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీని ద్వారా 2 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.