కొనసాగుతున్న డెక్కన్ మాల్ బిల్డింగ్ డిమాలిషన్ పనులు

కొనసాగుతున్న డెక్కన్ మాల్ బిల్డింగ్ డిమాలిషన్  పనులు
  • పూర్తయ్యేందుకు మరో వారం రోజులు పట్టే చాన్స్?

సికింద్రాబాద్​, వెలుగు: రాంగోపాల్ పేట పరిధి నల్లగుట్టలో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్​ స్పోర్ట్స్ బిల్డింగ్ కూల్చివేత పనులు శనివారం సైతం కొనసాగాయి.  టెండర్ దక్కించుకున్న సంస్థ ఆధ్వర్యంలో మూడ్రోజులుగా ఈ పనులు జరుగుతుండగా.. కేవలం 30 శాతమే కూల్చివేసినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 9 గంటలకు కూల్చివేతకు ఉపయోగించే  మెషీన్​ను మరింత ఎత్తులో అమర్చేందుకుగాను బిల్డింగ్ వేస్టేజ్ ను పెద్దకుప్పగా పోశారు. దాని ఎత్తును రెండో అంతస్తు వరకు పెంచి దానిపైనే మెషీన్​ను ఏర్పాటు చేసి కూల్చివేతలు చేపట్టారు. బిల్డింగ్ ‘ఎల్’ ఆకారంలో ఉండటంతో ప్రస్తుతం రోడ్డు వైపు ఉన్న ముందు భాగాన్ని ఆరో అంతస్తు నుంచి కూల్చివేస్తున్నారు. ఇప్పటి వరకు  బిల్డింగ్ ముందు భాగంలో ఒక పిల్లర్​ లెవెల్​లో మాత్రమే కూల్చివేశారు. అయితే మెషీన్​ను మరింత హైట్​లో ఏర్పాటు చేసే సమయంలో కూల్చివేత నిలిపివేయడంతో పనులకు కొంత అంతరాయం ఏర్పడుతోంది. దీంతో మొదట 5 రోజుల్లోనే బిల్డింగ్​ను కూల్చివేసి 15 రోజుల్లో వేస్టేజ్​ను తొలగిస్తామని టెండర్ దక్కించుకున్న సదరు సంస్థ  చెప్పినప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తూ మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  బిల్డింగ్ ముందువైపు ఇంకా 3 రూమ్ లను కూల్చాల్సి ఉంది. ఉదయం10 గంటల తర్వాత మొదలవుతున్న పనులు మధ్యాహ్నం టైమ్​లో నిలిచిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ సాయంత్రం మొదలుపెట్టి తొందరగా ముగిస్తున్నారని వారు అంటున్నారు. శనివారం సైతం పనులను ప్రారంభించిన కొద్దిసేపటికే  నిలిపివేయడంతో సదరు కాంట్రాక్ట్ సంస్థపై బల్దియా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కూల్చివేత టైమ్​లో వచ్చే దుమ్ముతో ఇబ్బందిపడుతున్నామని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. 

మినిస్టర్ రోడ్ క్లోజ్.. ట్రాఫిక్ జామ్

బిల్డింగ్ కూల్చివేత కారణంగా మినిస్టర్ రోడ్​ను  మూసివేశారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ రోడ్డును మూసి వేయడంతో రసూల్​పురా నుంచి రాణిగంజ్ ​వైపు నేరుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హుస్సేన్​సాగర్​, రాణిగంజ్​వైపు నుంచి రసూల్​పురా వైపు వెళ్లే వాహనదారులు, రసూల్​పురా నుంచి రాణిగంజ్​వైపు వెళ్లే వారు చుట్టూ తిరిగా రావాల్సి వస్తోంది. దీంతో మెయిన్​రోడ్​లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. 

బిజనెస్​లు బంద్​...

డెక్కన్ మాల్ బిల్డింగ్ ఉన్న రోడ్డుకు ఇరువైపులా హోటళ్లు, కార్ డెకార్ షాప్​లు, మెకానిక్ షాప్​లు, హాస్పిటల్స్ ఉన్నాయి. కూల్చివేత పూర్తయ్యే వరకు బిల్డింగ్​కు అతి దగ్గరలోని షాపులతో పాటు 500 మీటర్ల లోపు ఉన్న షాపులను పోలీసులు మూసివేయించారు.  దీంతో తమ బిజినెస్ పూర్తిగా దెబ్బతింటోందని.. మరో వారం రోజులు కూల్చివేతలు సాగితే తమ పరిస్థితేంటని షాపుల నిర్వాహకులు వాపోతున్నారు.

బిల్డింగ్​ను సందర్శించిన ఫొరెన్సిక్ టీమ్

అగ్ని ప్రమాదం  జరిగినపుడు గల్లంతైన మరో ఇద్దరి డెడ్​బాడీలు ఇంకా దొరకలేదు.  ఫొరెన్సిక్ టీమ్ శనివారం బిల్డింగ్​ను సందర్శించింది. చనిపోయిన వారి ఆనవాళ్ల కోసం రెండు, మూడో అంతస్తులను పరిశీలించింది. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వస్తువులు, కూల్చివేతలతో వస్తున్న బిల్డింగ్ వేస్టేజ్ కలిసిపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆనవాళ్లు దొరికే అవకాశాలు కనిపించడం లేదని ఫొరెన్సిక్ టీమ్ చెబుతోంది. కూల్చివేతలు 50 శాతం పూర్తయితే ఏదైనా ఆనవాళ్లు దొరకవచ్చని ఫొరెన్సిక్ టీమ్ భావిస్తున్నట్లు  తెలుస్తోంది.