సరళ సాగర్, రామన్‌‌ పాడులకు కొనసాగుతున్న వరద

సరళ సాగర్, రామన్‌‌ పాడులకు కొనసాగుతున్న వరద
  • రెండు రోజులుగా మదనాపూర్ ఆత్మకూరుల మధ్య రాకపోకలు బంద్

వనపర్తి/ మదనాపురం, వెలుగు: రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో ఎగువ నుంచి సరళ సాగర్ ప్రాజెక్టు, రామన్​పాడు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాల కారణంగా సరళా సాగర్ జలాశయానికి వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్టులోని  రెండు ప్రైమరీ, రెండు వుడ్ సైఫన్ల నుంచి దాదాపు 14 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న ఊక చెట్టు వాగు  గుండా రామన్ పాడు జలాశయానికి పోతోంది. 

దీంతో  వనపర్తి రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఆత్మకూరు– కొత్తకోట రోడ్డు మధ్య మినీ కాజ్ వే  పై వరద నీరు ఉదృతంగా పారుతుండడంతో రెండు రోజులుగా ఆత్మకూరు వనపర్తి జిల్లా కేంద్రానికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నడవడం లేదు. జనాలు కూడా రెండు ఊళ్ల మధ్య నడవడానికి అవస్థలు పడుతున్నారు. ఊక చెట్టు వాగుకు సరళా సాగర్ వరదనీటితోపాటు శంకర సముద్రం మూడు గేట్లు ఎత్తడం వల్ల వరద నీరు  చేరుతోంది. 

దంతనూరు, శంకరమ్మ పేట కాజు వే పై భారీగా వరద పోవడంతో ఆ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దిగువలో ఉన్న రామనుపాడు ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండడంతో ప్రాజెక్టుకున్న 10 గేట్లలో రెండు గేట్లను ఓపెన్ చేసి దాదాపు 14 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఏఈ. వరప్రసాద్ తెలిపారు. ముప్పు తలెత్తకుండా తహసీల్దార్ జేకే మోహన్. ఎస్సై. శేఖర్ రెడ్డి పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.