కాంటాలు వేయరు.. తరుగు దోపిడీ ఆపరు

 కాంటాలు వేయరు.. తరుగు దోపిడీ ఆపరు
  •  కాంటాలు వేయరు.. తరుగు దోపిడీ ఆపరు
  • జిల్లాల్లో కొనసాగుతున్న ధాన్యం రైతుల నిరసనలు
  • వడ్ల కుప్పలకు నిప్పు పెట్టి ఆవేదన

వెలుగు నెట్​వర్క్​: ధాన్యం రైతుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కాంటాలు లేటు కావడం, తాలు పేరుతో తరుగు తీయడం లాంటి సమస్యలతో రైతుల నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లిలో కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని  కరీంనగర్ మిల్లుకు తీసుకుపోయారు. మిల్లర్లు తేమ శాతం పేరుతో బస్తాకు 4 కిలోల తరుగు తీశారు. దీన్ని నిరసిస్తూ రైతులు శనివారం వడ్ల రాశిని తగులబెట్టి రాస్తారోకో నిర్వహించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలో కొనుగోలు కేంద్రం నుంచి నాలుగు లారీల్లో  ధాన్యాన్ని హనుమకొండలోని రాంపూర్‌‌ లో గల సూర్యతేజ రైస్​ మిల్లుకు తరలించారు. తాలు పేరుతో మిల్లర్లు​ అన్​లోడింగ్​ చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రంలో కాంటాలు నిలిపివేశారు.  రైతులు  ఆగ్రహంతో ధాన్యానికి నిప్పు పెట్టారు. వడ్లు తరలించడానికి లారీలను పంపకపోవడంతో ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయని మెదక్ –హైదరాబాద్ హైవేపై  మెదక్​ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్  చౌరస్తా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.  వడ్లు కొనలేని ప్రభుత్వం దిగిపోవాలంటూ నినాదాలు చేశారు.