- బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
- వాట్సాప్‌లో వీడియో కాల్స్ చేస్తున్న యువతులు
- అవతలి వ్యక్తి అప్రమత్తం అయ్యేలోగా స్క్రీన్ షాట్స్
- సోషల్‌మీడియాలో వైరల్ చేస్తామంటూ టార్చర్
- బ్లాక్ మెయిల్ చేస్తూ అందినకాడికి దోపిడీ
- బయటకు చెప్పుకోలేక కుంగిపోతున్న బాధితులు
- అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఇటీవలి కాలంలో ఆన్‌లైన్, సైబర్‌నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్‌నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో అవతలి వ్యక్తుల్ని బురిడీ కొట్టించి, అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఆన్‌లైన్ న్యూడ్ కాల్స్‌కు తెరతీశారు. హై ప్రొఫైల్ వ్యక్తులే లక్ష్యంగా యువతులతో న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తున్నారు.
వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ.. అవతలి వ్యక్తి అప్రమత్తం అయ్యేలోపే స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేస్తున్నారు. నగ్నంగా ఉన్న యువతుల వీడియోలతో వారి ఫొటోలు, వీడియోలను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు న్యూడ్ కాల్‌లో ఉన్న యువతి ఆత్మహత్య చేసుకున్నదని, పోలీసులు అరెస్ట్ చేస్తారని బెదిరిస్తూ.. బాధితుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు.
ప్రముఖులు, సంపన్నులే టార్గెట్
సొసైటీలో హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫోన్ నంబర్స్ సేకరిస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, బిజినెస్‌మెన్స్ కు అర్ధరాత్రి సమయాల్లో లేడీ డీపీతో వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు. నిద్రమైకంలో వాట్సాప్ కాల్ ఆన్సర్ చేసిన వారికి నగ్నంగా ఉన్న యువతి వీడియో కనిపిస్తున్నది. కానీ ఆ యువతి ముఖం కనిపించకుండా, మిగితా శరీరం మాత్రం కనిపించేలా కెమెరా ఆపరేట్ చేస్తున్నారు. ఇలా వీడియో కాల్స్ చేస్తూ ఫేస్, వాయిస్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు అప్రమత్తమయ్యేలోగా న్యూడ్ వీడియోలో ఉన్న ఫొటోను బాధితులకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు.
సొషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారిని గుర్తించి..
ఈ కామర్స్ సైట్స్, డార్క్‌నెట్, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా సైబర్ నేరగాళ్లు బల్క్‌లో ఫోన్ నంబర్స్ కొనుగోలు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్‌లోని మొబైల్ ఫోన్స్ దొంగిలించే ముఠాల వద్ద తక్కువ ధరలో పాత స్మార్ట్ ఫోన్లు సేకరిస్తున్నారు. ఫేక్ డ్యాక్యుమెంట్స్‌తో తీసుకున్న ఫోన్ నంబర్స్‌తో వాట్సాప్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే హై ప్రొఫైల్ వ్యక్తులను గుర్తిస్తున్నారు. వారు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్న పోస్టింగ్స్, ఫాలోవర్స్‌ను బట్టి వారి ఆర్థిక స్థోమత, అధికారాలను గమనిస్తున్నారు. ఇలా టార్గెట్ చేసిన వ్యక్తులకు వాట్సాప్,స్కైప్, ఇన్‌స్టా సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. కాల్ ఆన్సర్ చేసిన వెంటనే ఫేస్ పిక్చర్ తీసుకుంటున్నారు.
పిక్చర్, వాయిస్ రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్
సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియోలను క్యాప్చర్ చేసిన తర్వాత బ్లాక్ మెయిలింగ్ ప్రారంభిస్తున్నారు. ఫోన్ కాంటాక్ట్స్ తమ వద్ద ఉన్నాయని, గ్రూప్స్‌లో వీడియోలు, ఫొటోలు వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. బాధితులు అప్రమత్తం అయ్యే లోగా పదుల సంఖ్యలో కాల్స్ చేస్తున్నారు. వారి నమ్మించేందుకు ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేసిన స్ర్కీన్ షాట్స్‌ను వారికే షేర్ చేస్తున్నారు.
ఇలా ట్రాప్ చేసిన వ్యక్తుల వద్ద రూ.లక్షల నుంచి అందినంతా దోచేస్తున్నారు. దీంతోపాటు వాట్సాప్, ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ‘హాయ్’ అని మేసేజ్ చేసి, స్పందించిన వారిని ట్రాప్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో చాటింగ్ చేస్తున్నారు. తమ నెట్‌వర్క్‌లోని లేడీస్ వాయిస్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు.
ఏజ్ గ్రూప్ ఆధారంగా చాటింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్ అంటే ఇష్టమని నమ్మించి..పర్సనల్‌గా మాట్లాడుకుందాం అంటూ ఆఫర్‌చేస్తున్నారు. ఇలా వారి ఉచ్చులో చిక్కిన వారి ఒంటిపై బట్టలు విప్పించి వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ.. దోచుకుంటున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినుంచి 3 లక్షలు కొట్టేశారు
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వర్క్‌ఫ్రం హోమ్ బిజీలో ఉండగా వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ ఆన్సర్ చేసిన వెంటనే యువతి న్యూడ్‌గా దర్శనమిచ్చింది. ఆమె ఆ ఉద్యోగి వీడియోస్, ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని బాయ్ చెప్పింది. ఆ తర్వాత గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ చేసి, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ తమ దగ్గర ఉన్నాయంటూ బెదిరింపులు స్టార్ట్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి, అతడి వద్దనుంచి రూ.3.4 లక్షలు కొట్టేశారు.
వివరాలు గోప్యంగా ఉంచుతం
న్యూడ్ కాల్స్ మాఫియా ఉచ్చులో చిక్కుకున్న చాలా మంది బాధితులు పరువు పోతుందని బయటకు చెప్పుకోలేక పోతున్నారు. బ్లాక్ మెయిల్ భరిస్తూ నేరస్తులు అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఇందుకు కారణం సమాజం లో మంచి హోదా ఉన్న వ్యక్తులు, అధికారు లు కావడమే. ఇలాంటి ట్రాప్‌లో చిక్కిన బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేయాలి. బాధితుల వివరాలు రహస్యంగా ఉంచుతాం. టెక్నికల్ ఆధారాలతో బ్లాక్‌మెయిలింగ్ గ్యాంగులను పట్టుకుంటాం.
-కేవీఎం ప్రసాద్, డీఎస్పీ, సైబర్ క్రైం బ్యూరో
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌కు..
ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌కు గత నవంబర్‌లో వీడియో కాల్ వచ్చింది. ఆ ఫోన్ నంబర్ తన మొబైల్‌లో ఫీడ్ అయి లేదు. అయితే, ఆయన అనుకోకుండా వీడియో కాల్ లిఫ్ట్ చేశాడు. నగ్నంగా ఓ యువతి కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కాల్ కట్ చేసేలోగా అప్పటికే ఆయనకు మరో కాల్ వచ్చింది. ఆయన నంబర్‌కి స్క్రీన్‌షాట్ పంపించి బ్లాక్ మెయిల్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాడు. వెస్ట్ బెంగాల్ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు.
ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు ఈ నెల14న అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఎమ్మెల్యే ఆ వీడియో కాల్‌ను ఆన్సర్ చేసిన వెంటనే ఓ మహిళ నగ్నంగా కనిపించింది. ఆ వెంటనే ఎమ్మెల్యే ఫోన్ కట్ చేశారు. వీడియో కాల్ వచ్చిన ఫోన్ నంబర్ తన కాంటాక్ట్ లిస్ట్‌లో లేకపోవడం, మహిళ నగ్నంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు.
సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వ్యక్తులు చేశారా? లేదా వెస్ట్ బెంగాల్ గ్యాంగ్ చేసిందా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.