ఇంటర్ అడ్మిషన్లు ఆగమేనా?

ఇంటర్ అడ్మిషన్లు ఆగమేనా?

ఇంటర్‌‌ ఫలితాల పంచాయతీ సమసిపోకముందే బోర్డులో మరో లొల్లి తెరపైకొచ్చింది. విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులైనా ఆన్‌‌లైన్‌‌ అడ్మిషన్ల ప్రక్రియే మొదలు కాలేదు. అసలా ప్రక్రియను ఎవరికివ్వాలో కూడా ఇంటర్‌‌ బోర్డు నిర్ణయం తీసుకోలేదు. సీజీజీకి ఇవ్వాలని అనుకోవడం, తమ వల్ల కాదని సంస్థ చేతులెత్తేయడంతో మళ్లీ గ్లోబరీనా వైపే బోర్డు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫలితాల్లో ఇంత లొల్లి జరిగినా బోర్డు తీరు మారలేదని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు ఆన్‌‌లైన్‌‌ లేటవుతుండటంతో సర్కారు కాలేజీలకు నష్టం జరుగుతోందని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీజీజీకే కమిటీ మొగ్గు…

రాష్ర్టంలో 2,558 జూనియర్‌‌ కాలేజీలున్నాయి. వీటిల్లో404  సర్కారువి..1,583 ప్రైవేటు, 41 ఎయిడెడ్‌‌, వివిధ శాఖల పరిధిలో 530 గురుకుల కాలేజీలున్నాయి. ఏటా ఐదున్నర లక్షల మంది వీటిల్లో చేరుతున్నారు. జూన్‌‌ 1న కాలేజీలు మొదలయ్యాయి. చేరిన స్టూడెంట్ల వివరాలు ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌డేట్‌‌ చేయాలి. కానీ ఆన్‌‌లైన్‌‌ ప్రాసెస్‌‌ ఆలస్యమవుతుండటంతో సర్కారీ కాలేజీ స్టూడెంట్లను ప్రైవేటు కాలేజీలు లాక్కుంటున్నాయని లెక్చరర్లు చెబుతున్నారు. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ నుంచి సర్టిఫికెట్ల వరకూ అన్ని బాధ్యతలను గ్లోబరీనాకు ఇచ్చారు. కానీ అడ్మిషన్ల ప్రక్రియలో గందరగోళంతో సీజీజీకు అప్పగించారు. తర్వాత గ్లోబరీనా నిర్వహించిన ఆన్‌‌లైన్‌‌ ఫీజులు, హాల్‌‌టికెట్లు, మార్కులు.. ఇలా అన్నింట్లో తప్పులు దొర్లిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి అడ్మిషన్ల ప్రక్రియ ఎవరికివ్వాలని నిర్ణయించేందుకు ఏడుగురు సభ్యులతో బోర్డు కార్యదర్శి అశోక్‌‌ కుమార్‌‌ కమిటీ వేయగా గ్లోబరీనా వద్దని, సీజీజీకే ఇవ్వాలని కమిటీ తేల్చిచెప్పినట్టు సమాచారం.

చేతులెత్తేసిన సీజీజీ!…

ఇంటర్‌‌ బోర్డు కమిటీ నిర్ణయం మేరకు ఈ ఏడాది కూడా అడ్మిషన్ల ప్రక్రియను సీజీజీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయమై సంస్థకు లేఖ రాశారు. అయితే తగినంత సిబ్బంది లేరని, ఆ బాధ్యతను నిర్వహించలేమని చివరి నిమిషంలో సీజీజీ చేతులెత్తేసినట్టు సమాచారం. ఇంటర్‌‌ బోర్డు వివాదంలో ఉండటం, అడ్మిషన్ల ఆన్‌‌లైన్‌‌ ప్రాసెస్‌‌లో తప్పులొస్తే సీజీజీకీ చెడ్డపేరొస్తుందనే భయంతో వారు వెనక్కి తగ్గారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రెండు, మూడ్రోజుల్లో క్లారిటీ…

అడ్మిషన్ల ప్రక్రియకు సీజీజీ ‘నో’ చెప్పడంతో బోర్డు అధికారులు మళ్లీ గ్లోబరీనా వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై బోర్డు అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. వేరే సంస్థ ఉద్యోగులతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని కూడా బోర్డు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. రెండు, మూడ్రోజుల్లో ఈ పంచాయతీపై క్లారిటీ రావొచ్చు.