ఇంటర్​లో ఆన్​లైన్ వాల్యుయేషన్

ఇంటర్​లో ఆన్​లైన్ వాల్యుయేషన్
  • ఈ అకడమిక్​ ఇయర్​ నుంచే అమలుకు బోర్డు చర్యలు 
  • గతంలో మైనర్ లాంగ్వేజీల్లోనే చేస్తామన్న విద్యాశాఖ 
  • ప్రస్తుతం సగానికి పైగా సబ్జెక్టుల్లో ఇంప్లిమెంట్​పై ఆందోళన

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్​లో ఈ అకడమిక్ ఇయర్​ నుంచి ఆన్​లైన్ వాల్యుయేషన్ మొదలుకానున్నది. సైన్స్ మినహా అన్ని సబ్జెక్టుల్లోనూ అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ నోటిఫికేషన్​ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, సగానికి పైగా సబ్జెక్టుల్లో అమలు చేయడంపై అందరిలో అయోమయం నెలకొన్నది. రాష్ట్రంలో ఇంటర్​లో 9 లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో 5 లక్షల మంది ఎంపీసీ, బైపీసీ లాంటి సైన్స్ కోర్సులు చదువుతుండగా, మిగిలిన వారంతా సీఈసీ, హెచ్​ఈసీ, ఇతర కోర్సుల్లో ఉన్నారు. అయితే, కొంతకాలంగా ఇంటర్​ ఎగ్జామ్స్​లో ఆన్​లైన్ వాల్యుయేషన్​పై చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలోనూ దీనిపై చర్చించారు. తొలుత ఒకటి, రెండు మైనర్ లాంగ్వేజీ సబ్జెక్టుల్లో ప్రయోగాత్మకంగా వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని, తర్వాత దశలవారీగా అన్ని సబ్జెక్టుల్లో అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కానీ, బోర్డు మీటింగ్​లో తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా అన్ని లాంగ్వేజీ సబ్జెక్టులతో పాటు హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లోనూ అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2022–23 అకడమిక్ ​ఇయర్​తో పాటు 2023–24లో దీన్ని అమలు చేయాలని, 2023–24లో సైన్స్ సబ్జెక్టుల్లోనూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు చేయాలని నిర్ణయించారు. 

ఒకేసారి సగానికి పైగా సాధ్యమా?

ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లు ఫస్ట్ లాంగ్వేజీ, సెకండ్ లాంగ్వేజీ పేపర్లను తప్పనిసరిగా రాయాలి. ఈ లెక్కన సుమారు 18లక్షలకు పైగా ఆన్సర్ స్ర్కిప్ట్స్​ ఆన్​లైన్ వాల్యుయేషన్ చేయాలి. వీటితో పాటు హుమానిటీస్(సోషల్) సబ్జెక్టుల్లోనూ 4 లక్షల మంది ఉంటారు. ఆయా స్టూడెంట్లవి ఆన్​లైన్ వాల్యుయేషన్ వేయాలి. కేవలం సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్ పేపర్లను మాత్రమే మ్యాన్యువల్​గా దిద్దనున్నారు. అయితే, ఒకేసారి లక్షల ఆన్సర్ పేపర్లను ఆన్​లైన్​లో  వాల్యుయేషన్ చేయడం సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్చరర్లకు కూడా దీనిపై అంటే అవగాహన లేదు. ఈ ప్రక్రియలో పాల్గొనే లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కనీసం రెండు, మూడు సార్లు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ అలాంటి చర్యలేమీ ఇంటర్ బోర్డు తీసుకోలేదు. చివరి నిమిషంలో తూతూమంత్రంగా ట్రైనింగ్ ఇచ్చి, ఆన్​లైన్ వాల్యుయేషన్ చేయిస్తే ఎలా అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఏమైనా తప్పులొస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు మొదలయ్యాయి.