శ‌త కోటి వ్యాక్సిన్ సంబురాల‌పై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

శ‌త కోటి వ్యాక్సిన్ సంబురాల‌పై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు
  • రెండు డోసులు వేసింది 21 శాతం జ‌నాభాకే
  • ఈ మాత్రం దానికే సంబురాలా?: కాంగ్రెస్ నేత‌ల ట్వీట్లు

దేశంలో 100 కోట్ల డోసుల క‌రోనా వ్యాక్సినేష‌న్ పూర్తయిన సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్ర‌సంగించిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌ల‌కు దిగింది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ శ‌శిథ‌రూర్ వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. వంద కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తయిన సంద‌ర్భంగా మీకో విష‌యం గుర్తుచేస్తున్నా అంటూ “The day after 1 billion.... A reminder!” అన్న క్యాప్ష‌న్‌తో ఆయ‌న ఓ కార్టూన్ ఇమేజ్‌ను పోస్ట్ చేశారు. ఒక సామాన్యుడిపై క‌రోనా భారం, దానిపై సిలిండ‌ర్, పెట్రోల ధ‌ర‌ల బాదుడు, వాటిపై ఒక గుండ్ర‌టి బాల్‌పై మోడీ యోగాస‌నాలు వేస్తుంటే ఆయ‌న పొట్ట‌పై గిన్నెలో నెమ‌లి నీళ్లు తాగుతున్న‌ట్టుగా ఆ కార్టూన్‌ను చిత్రించారు. వ్యాక్సిన్ సంబురాల‌తో పాటు వీటి సంగతి ప‌ట్టించుకోండ‌న్న‌ట్లుగా గుర్తు చేస్తూ శ‌శిథ‌రూర్ ట్వీట్ చేశారు.

ఏం సాధించార‌ని సంబురాలు?

ఇక క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య కూడా వంద కోట్ల డోసుల‌ వ్యాక్సిన్ సంబురాల‌ను త‌ప్పుప‌డుతూ ట్వీట్ చేశారు. వంద కోట్ల డోసులు అన్న‌ది ఒక ఫ్యాన్సీ నంబ‌ర్‌గా కనిపిస్తోంద‌ని, కానీ వివ‌రాల్లోకి వెళ్తే క‌ఠోర‌మైన విష‌యాలు తెలుస్తాయ‌ని ఆయ‌న అన్నారు. 139 కోట్ల మంది ప్ర‌జ‌ల్లో రెండు డోసుల వ్యాక్సినేషన్ అయ్యింది కేవ‌లం 29 కోట్ల మందికేన‌ని, ఇది 21 శాతం మాత్ర‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌రి బీజేపీ నేత‌లు ఏం సాధించినందుకు సంబురాలు చేసుకుంటున్నారో చెప్పాల‌న్నారు.

“అమెరికాలో 56 శాతం జ‌నాభాకు, చైనాలో 70 శాతం, కెన‌డాలో 71 శాతం ఫుల్ వ్యాక్సినేష‌న్ పూర్తయింది. మ‌న దేశంలో 21 శాతం జ‌నాభాకు మాత్ర‌మే వ్యాక్సినేష‌న్ పూర్తి చేసినందుకే ఈ సంబురాలా?.. 29 కోట్ల మందికి మాత్ర‌మే రెండు డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇంకో 49 కోట్ల మందికి ఒక్క డోసే అందింది. 62 కోట్ల మందికి ఇంకా ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ వేయ‌లేదు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 31 క‌ల్లా వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం పెట్టుకున్న ల‌క్ష్యం పూర్తి చేయాలంటే ఇంకా 106 కోట్ల డోసులు వేయాలి. అంటే ఎంత వేగంగా రోజూ వ్యాక్సిన్లు వేయాలో చూడండి. అంత‌టి భారీ సంఖ్య‌లో వ్యాక్సిన్లు వేసేందుకు మ‌నం సిద్ధంగా ఉన్నామా అన్న‌ది ఆలోచించండి” అంటూ సిద్ద‌రామ‌య్య వ‌రుస ట్వీట్లు చేశారు.