కాళేశ్వరానికి రూ.80 వేల కోట్లే ఖర్చు చేసినం : మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

కాళేశ్వరానికి రూ.80 వేల కోట్లే ఖర్చు చేసినం : మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

వరంగల్‍, వెలుగు : కాళేశ్వరం నిర్మాణానికి ప్రభుత్వం రూ. 80 వేల కోట్లే ఖర్చు చేసిందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ చీఫ్‌‌ విప్‌‌ దాస్యం వినయ్‌‌భాస్కర్‌‌, కుడా చైర్మన్‌‌ సుందర్‌‌రాజ్‌‌తో కలిసి సోమవారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ రాహుల్‌‌గాంధీ మాట్లాడడం సరికాదన్నారు. ప్రాజెక్ట్‌‌పై ఎలాంటి అవగాహన లేని రాహుల్‌‌గాంధీ రేవంత్‌‌రెడ్డి, భట్టి విక్రమార్క రాసిచ్చిన స్ర్కిప్ట్‌‌ చదివారని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి నిర్వహించలేక భయపడి పారిపోయాడని ఎద్దేవా చేశారు. అవినీతి, స్కాంలను దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్‌‌ అని అన్నారు. 

కాంగ్రెస్‌‌ బయట తిరగలేని పరిస్థితి కల్పిస్తేనే తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కర్నాటకలో రూ.800 పెన్షన్‌‌ ఇస్తున్న కాంగ్రెస్‌‌ తెలంగాణలో రూ.4 వేలు ఇస్తామంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ గెలిచే ఒక్క సీటు పేరు చెప్పాలని సవాల్‌‌ చేశారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‍ జీరోకు పడిపోయిందని, ఆ పార్టీ 2 నుంచి 3 సీట్లకే పరిమితం అవుతుందన్నారు. బయ్యారం స్టీల్‍ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం తన వైఖరి చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. కాజీపేటలో వ్యాగన్‌‌ ఫ్యాక్టరీకి డీపీఆర్, అప్రూవల్స్‌‌ లేకుండానే ప్రధానితో ప్రారంభిస్తామని చెప్పడం మోసమే అన్నారు.