బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది

బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను అరెస్ట్ చేయటంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పట్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు పలురకాల కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ కూడా ఈ విషయంపై స్పందించారు. 

సంజయ్‌ రౌత్‌ను ఎంతో ధైర్యమైన వ్యక్తిగా ఎంపీ అధిర్ రంజన్ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో బీజేపీపై పలురకాల విమర్శలు గుప్పించారు. అందులో భాగంగా కాషాయ పార్టీపై మండిపడుతూ ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ రాజకీయాలకు, బెదిరింపులకు సంజయ్ రౌత్ ఎప్పుడూ తలొంచలేదు. ఆయన చేసిన నేరం అదే అని అధిర్ రంజన్ చెప్పుకొచ్చారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ ఎంతో ధైర్యవంతుడు. ఆయనకు అండగా మేముంటాం అంటూ అధిర్ రంజన్ తమ మద్దతును ప్రకటించారు.

ఇక మరో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఈ విషయంపై స్పందించారు. బీజేపీ సెంట్రల్ ఏజెన్సీని దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నేతలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలున్నది రాజకీయాలు చేయటం కోసం కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఇలా చేస్తోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బీజేపీకి అపోజిషన్ ముక్త్ పార్లమెంట్‌ కావాలన్న ఆయన... అందులో భాగంగానే సంజయ్‌ రౌత్‌ను ఇలా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.