- హిందువులు, సిక్కులు, బౌద్ధులకే ఆ హోదా
- ఆ మతాలు కాకుండా వేరే మతాన్ని
- అనుసరించే వ్యక్తిని ఎస్సీగా పరిగణించలేం
- ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
- మతం మారిన వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారు
- అట్రాసిటీ కేసులు పెట్టే హక్కు ఉండదని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తినీ షెడ్యూల్డ్ క్యాస్ట్ సభ్యునిగా పరిగణించలేమని పేర్కొంది. ఏ ఇతర మతంలోకి మారినా, తక్షణమే షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతారని వెల్లడించింది. మంగళవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో 2025 ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును బెంచ్ సమర్థించింది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారుడు దశాబ్దకాలంగా పాస్టర్‌గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘క్రైస్తవ మతంలో కులవ్యవస్థకు తావులేదు. కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదు.
ప్రస్తుత కేసులో పిటిషనర్ తాను క్రైస్తవ మతం నుంచి తన అసలు మతంలోకి తిరిగి మారానని గానీ, లేదా మాదిగ సమాజంలో తిరిగి కలిసిపోయానని గానీ వాదించడం లేదు. దీనికి విరుద్ధంగా, అతను క్రైస్తవ మతాన్ని పాటిస్తూనే ఉన్నాడని, దశాబ్దానికి పైగా గ్రామంలోని ఇళ్లలో క్రమం తప్పకుండా ప్రార్థనలు నిర్వహిస్తూ పాస్టర్‌గా పనిచేస్తున్నాడని సాక్ష్యాధారాలు స్పష్టం చేశాయి. అతనిపై దాడి జరిగినప్పుడు కూడా ఆ వ్యక్తి తన ఇంట్లో ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఈ వాస్తవాలు, సంఘటన జరిగిన రోజున ఆయన క్రైస్తవుడిగానే కొనసాగాడనే విషయంలో సందేహం లేదు’’ అని ధర్మాసనం పేర్కొంది. ఫిర్యాదుదారుడికి తహసీల్దార్ ఇచ్చిన కులధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మతమార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని కోర్టు వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారి, ఆ ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి.. షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేరని స్పష్టం చేసింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని, ఈ ఉత్తర్వులోని నిషేధం సంపూర్ణమైనదని కోర్టు పేర్కొంది. 1950 నాటి ఉత్తర్వులోని క్లాజ్ 3లో పేర్కొనని ఏ మతంలోకి మారినా, పుట్టుకతో సంబంధం లేకుండా తక్షణమే షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం
కింద రక్షణ లభించదని తెలిపింది.
కేసు ఏంటంటే..
కులం పేరుతో దూషించి, దాడి చేశారని ఏపీలోని పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో ఆరుగురిపై చందోలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. దీంతో ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. అయితే.. ఫిర్యాదుదారుడు గత పదేండ్లుగా పాస్టర్ గా ఉన్నారని, క్రైస్తవంలోకి మారిన వారిని ఎస్సీ కులస్తులుగా పరిగణించకూడని నిందితులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తమపై దాఖలైన కేసులు కొట్టివేయాలని పిటిషన్ లో కోరారు. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్-1950 ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారన్న వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నిందితుల తరపు వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని నిరుడు మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై చింతాడ ఆనంద్ అదే ఏడాది జులై 3న సుప్రీంకోర్టులో సవాలు చేశాడు.
