గాలిలో తేలుతూ సిటీ చుట్టేద్దామా ! హైదరాబాద్‌‌లో ఓపెన్‌‌ టాప్‌‌ డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సులు

గాలిలో తేలుతూ సిటీ చుట్టేద్దామా ! హైదరాబాద్‌‌లో ఓపెన్‌‌ టాప్‌‌ డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సులు
  • నగర అందాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖ
  • ట్యాంక్‌‌బండ్‌‌ నుంచి చార్మినార్‌‌, గోల్కొండ, హైటెక్‌‌ సిటీ వరకు పర్యాటక సర్క్యూట్‌‌
  • రెండు డబుల్​ డెక్కర్​ బస్సులను కొనేందుకు సిద్ధం
  • హెచ్ఎండీఏ పరిధిలోని మరో 6 ఈ–బస్సులు టూరిజం శాఖకు అప్పగింత

ఆకాశమే హద్దుగా గాలిలో తేలియాడితే ఆ అనుభూతే వేరు. అలాంటి అనుభూతిని పంచుతూ హైదరాబాద్​ అందాలను చూపించేందుకు పర్యాటక శాఖ  సరికొత్త ఆలోచన చేసింది. నగర చారిత్రక ప్రాంతాలను, ఆధునిక అందాలను ఓపెన్‌‌ టాప్‌‌ డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సులో కూర్చొని వీక్షించే అవకాశం కల్పించనుంది.

లండన్‌‌ తరహా పర్యాటక ఫీల్​ను హైదరాబాద్‌‌లో అందించేందుకు అత్యాధునిక హంగులతో ఈ బస్సులను తీసుకువస్తోంది. సిటీలోని చారిత్రక వైభవం నుంచి ఆధునిక సొబగుల వరకు ఒకే పర్యాటక సర్క్యూట్‌‌లో చుట్టొచ్చేలా కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్‌‌, వెలుగు: నగరవాసులతోపాటు హైదరాబాద్‌‌కు వచ్చే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ రెండు ఓపెన్‌‌ టాప్‌‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నది. లండన్‌‌ తరహాలో టాప్‌‌ లేని డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సుపై కూర్చొని నగర అందాలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నది. 

నగర వారసత్వ సంపదతోపాటు ఆధునిక కట్టడాలను చూసేలా ఓపెన్‌‌ టాప్‌‌ ఎలక్ట్రిక్‌‌ డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సులను కొనుగోలు చేయనున్నది. ఇప్పటికే బస్సులను సమకూర్చుకునేందుకు ఇటీవల అర్హులైన సంస్థల నుంచి ప్రతిపాదనలు (ఆర్‌‌ఎఫ్‌‌పీ) ఆహ్వానించింది. దరఖాస్తులు, బిడ్లు సమర్పించేందుకు బుధవారం వరకు గడువు విధించారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని టూరిజం అధికారులు చెప్తున్నారు.

అప్పర్‌‌ డెక్‌‌ ఓపెన్‌‌.. లోయర్‌‌ డెక్‌‌ ఏసీ..
పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బస్సులను తయారు చేస్తున్నారు. బస్సు అప్పర్‌‌ డెక్‌‌కు ఎలాంటి రూఫ్‌‌ ఉండదు. దీంతో ప్రయాణికులు ప్రకృతిని ఆస్వాదిస్తూ నగర అందాలను వీక్షించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎండ, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లోయర్‌‌ డెక్‌‌ను ఏసీ క్యాబిన్‌‌గా తీర్చిదిద్దుతున్నారు. నగర చరిత్ర, చారిత్రక ప్రాధాన్యతను పర్యాటకులకు వివరించేందుకు మైక్రోఫోన్‌‌తో కూడిన ఆధునిక గైడ్‌‌ వ్యవస్థతోపాటు పబ్లిక్‌‌ అడ్రస్‌‌ సిస్టమ్‌‌ను అనుసంధానిస్తున్నారు.

ప్రయాణికుల మొబైల్‌‌ ఛార్జింగ్‌‌ అవసరాల కోసం ప్రతి సీటు వద్ద యూఎస్‌‌బీ పోర్టులు ఏర్పాటు చేయనున్నారు. రాత్రివేళల్లో ఆకట్టుకునేలా బస్సులకు ఎల్‌‌ఈడీ లైట్లు అమర్చనున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం బస్సుల్లో జీపీఎస్‌‌, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

పర్యాటక శాఖ పరిధిలోకి హెచ్‌‌ఎండీఏ బస్సులు..
2023 ఫిబ్రవరిలో నగరంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్‌‌ సందర్భంగా హెచ్‌‌ఎండీఏ రూ.12 కోట్లతో, ఒక్కొక్కటి రూ.2 కోట్ల విలువైన ఆరు ఎలక్ట్రిక్​ డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సులను కొనుగోలు చేసింది. సింగిల్‌‌ ఛార్జింగ్‌‌తో 150 కిలోమీటర్లు ప్రయాణించే ఈ పర్యావరణహిత బస్సులను ఇప్పుడు పర్యాటక శాఖ ద్వారా సరికొత్త ఓపెన్‌‌ టాప్‌‌ హంగులతో పర్యాటకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌‌ఎండీఏ) ఆధీనంలో ఉన్న ఆరు ఎలక్ట్రిక్‌‌ డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సులను కూడా తమ విభాగానికి అప్పగించాల్సిందిగా పర్యాటక శాఖ కోరింది. దీనికి సంబంధించి రాసిన లేఖపై హెచ్‌‌ఎండీఏ ఉన్నతాధికారులు కూడా ఆమోదం తెలిపారు.

ఎనిమిది బస్సులతో పర్యాటక సర్క్యూట్‌‌..
హెచ్​ఎండీఏ పరిధిలోని ఆరు బస్సులు కూడా అందుబాటులోకి వస్తే మొత్తం ఎనిమిది డబుల్‌‌ డెక్కర్లతో సమగ్ర పర్యాటక సర్క్యూట్‌‌ను రూపొందించనున్నారు. ట్యాంక్‌‌బండ్‌‌, నెక్లెస్‌‌ రోడ్డు, గోల్కొండ కోట, చార్మినార్‌‌, కుతుబ్‌‌షాహి టూంబ్స్‌‌, హైటెక్‌‌ సిటీ, దుర్గం చెరువు, వేవ్‌‌రాక్‌‌తోపాటు నగరంలోని ప్రధాన కేంద్రాలను కలుపుతూ వీటిని తిప్పాలని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో పర్యాటక మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు పర్యాటకానికి సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామని టూరిజం ఎండీ గౌతమి పేర్కొన్నారు. అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. హరిత హోటల్స్‌‌ ఆధునీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.