ఇంగ్లండ్ టూర్ లో ఓపెనర్లే కీలకం

ఇంగ్లండ్ టూర్ లో ఓపెనర్లే కీలకం

వైట్​బాల్​ క్రికెట్​లో తన బ్యాట్​ పవర్ చూపెట్టిన స్టార్​ ఓపెనర్​ రోహిత్​ శర్మ​.. ఇప్పుడు రెడ్​బాల్​ ఫార్మాట్​లోనూ తన ప్రత్యేకతను చూపడానికి కృషి చేస్తున్నాడు..! ఈ నేపథ్యంలో 34 ఏళ్ల రోహిత్​కు డబ్ల్యూటీసీ ఫైనల్​తో పాటు ఇంగ్లండ్​ సిరీస్​ అతిపెద్ద సవాలు కానుంది..! బ్రిటన్​ గడ్డపై హిట్​మ్యాన్​ నిలబడితే.. తన టెస్ట్​ కెరీర్​ మారుతుంది.! ఒకవేళ ఫెయిలైతే.. మళ్లీ లిమిటెడ్​ ఓవర్స్​కు పరిమితమయ్యే ప్రమాదం ఉండటంతో రోహిత్​ చిన్ననాటి కోచ్​ దినేశ్​ లాడ్​.. శర్మకు సుతి మెత్తని వార్నింగ్​ ఇస్తున్నాడు..!  రెండోవైపు.. రోహిత్​కు అండగా నిలిచే క్రమంలో శుభ్​మన్​ గిల్​ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న మయాంక్​ అగర్వాల్​లో మెంటల్​ కాన్ఫిడెన్స్​ పెరగాలని అతని కోచ్​ మురళీ సలహాలు, సూచనలు చేస్తున్నాడు..! కీలక టూర్​కు ముందు తమ కోచ్​లు ఇచ్చే విలువైన సలహాలను ఈ ఓపెనర్లు పాటిస్తారా? పక్కాగా ప్రిపేర్​ అయి ఇంగ్లండ్​

గడ్డపై  టీమ్ విజయానికి పునాది వేస్తారా?   

న్యూఢిల్లీ: అప్పుడెప్పుడో 2014లో బ్రిటన్​ గడ్డపై ఫస్ట్​ టైమ్​ టెస్ట్​ మ్యాచ్ ఆడిన రోహిత్​ శర్మ.. ఆరో ప్లేస్​లో బ్యాటింగ్​కు దిగాడు. కానీ పెద్దగా రాణించిన దాఖలాలు మాత్రం లేవు. ఆ తర్వాత ఎక్కువగా వైట్​బాల్​ ఫార్మాట్​పై దృష్టిపెట్టి ఓ రేంజ్​కు ఎదిగాడు. కానీ 2019 మళ్లీ టెస్ట్​ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అతను ఇప్పుడిప్పుడే ఓపెనర్​గా సెటిల్​ అవుతున్నాడు. ఇప్పటివరకు ఫర్వాలేదనిపించినా.. ఇంగ్లండ్​తో సిరీస్​తోనే ఇప్పుడు అసలు కథ మొదలవుతున్నది. ఈ టూర్​లో హిట్​మ్యాన్​ ఏ మేరకు సక్సెస్​ అవుతాడన్న దానిపైనే అతని టెస్ట్​ ఫ్యూచర్​ ఆధారపడి ఉంటుంది. 

ఓపికగా ఆడితేనే..

ఇదే విషయంపై అతని చిన్న నాటి కోచ్​ దినేశ్​ లాడ్​ మాట్లాడుతూ.. రోహిత్​కు స్వీట్ వార్నింగ్​ ఇచ్చాడు. రోహిత్​ తన బ్యాటింగ్​పై ఫోకస్​ పెంచడంతో పాటు మరింత ఓపికగా ఆడాల్సిన అవసరం ఉందని సూచించాడు. ‘మంచి ఆరంభాలను పెద్ద​ స్కోర్లుగా మలిచే చాన్స్​ రోహిత్​ తీసుకోవాలి. ఇంగ్లండ్​ కండీషన్స్​లో ఇది చాలా అవసరం. ఆస్ట్రేలియాలో అతను బ్యాటింగ్​ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా పడింది. పేసర్లను ఎదుర్కొనే టైమ్​లో షాట్​ మేకింగ్​ సూపర్బ్​. ఔట్​ అయ్యేలా ఎప్పుడూ కనిపించలేదు. అయినప్పటికీ కొన్ని ఇన్నింగ్స్​ల్లో వికెట్లు సులువుగా ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్​లో అది జరగకుండా చూసుకుంటే చాలు’ అని లాడ్​ విశ్లేషించాడు. 

హార్డ్​ వర్క్​ చాలా ముఖ్యం..

ఇంగ్లండ్​లోని సీమింగ్​ కండీషన్స్​లో రోహిత్​ డ్యూక్​ బాల్స్​ను సమర్థంగా ఎదుర్కొంటే టీమిండియాకు మంచి అవకాశాలుంటాయని లాడ్​ చెప్పాడు. ‘ఇండియాలో ఇంగ్లండ్​తో జరిగిన సిరీస్​లో మన బ్యాట్స్​మెన్​ చాలా ఇబ్బంది పడ్డారు. అయినా రోహిత్​ చక్కగా నిలబడ్డాడు. ముందుండి టీమ్​ను నడిపించాడు. ఇంగ్లండ్​లోనూ పునరావృతం చేయాలి. దీనికి అతను చేయాల్సిందల్లా ఫోకస్​ పెట్టడమే. ప్రతి బాల్​ను దాని మెరిట్​ మేరకు ఆడితే చాలు. ఇదే చాలా పెద్ద ప్రభావాన్ని చూపెడుతుంది.  అయితే ఇంగ్లండ్​లో రోహిత్​కు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ఇంగ్లండ్​ మినహా ఏ ఇతర దేశంలో బాల్​ అంతలా స్వింగ్​ కాదు. అందుకే మంచి హార్డ్​వర్క్​తో దానిని హ్యాండిల్​ చేస్తే సరిపోతుంది. అయితే నెట్​ సెషన్స్​లో క్వాలిటీ బౌలర్లను ఎదుర్కొంటే బాగా వర్కౌట్​ అవుతుంది. ఇంగ్లండ్​ కండీషన్స్​కు అలవాటు పడేందుకు ఇది చాలా దోహదపడుతుంది’ అని కోచ్​ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ముంబైలోని గ్రాండ్​ హయత్​ హోటల్​లో క్వారంటైన్​లో ఉన్న  24 మందితో కూడిన టీమిండియా జూన్​ 2న సౌతాంప్టన్​ బయలుదేరుతుంది. అక్కడ మూడు రోజుల ఐసోలేషన్​ తర్వాత ప్రాక్టీస్​ మొదలుపెడుతుంది. 

కాన్ఫిడెన్స్​ పెరగాలి..

2018లో టెస్ట్​ క్రికెట్​లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మయాంక్​ అగర్వాల్​.. ఆ తర్వాత చతికిలపడ్డాడు. ఫామ్ కోల్పోవడంతో పాటు పాటు గిల్​ రాకతో ఏకంగా టీమ్​లో ప్లేస్​ కోల్పోయాడు. ఇప్పుడు నాలుగు నెలల ఇంగ్లండ్​ టూర్​ ఉండటంతో ఏదో ఓ దశలో ఓపెనర్​గా మళ్లీ ప్లేస్​ దక్కించుకుంటున్నాడని మయాంక్​ భావిస్తున్నాడు. అది జరగాలంటే.. ముందుగా మెంటల్​ కాన్ఫిడెన్స్​ పెంచుకోవాలని అతని చిన్ననాటి కోచ్​ ఆర్​ఎక్స్​ మురళీ సూచిస్తున్నాడు. ‘మన ఆట, ఫామ్​ మొత్తం మైండ్​సెట్​పైనే ఆధారపడి ఉంటుంది. మైండ్​లో సడెన్​గా డౌట్స్​ క్రియేట్​ అయితే అవి చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. దీంతో మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రతి ఒక్కదానిపై డౌట్​ పెట్టుకోకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది’ అని మురళీ పేర్కొన్నాడు. 

ప్రతి సిరీస్​కూ అడ్జెస్ట్​మెంట్స్​ అవసరం

ప్రతి ఓవర్​సీస్​ టూర్​లో బ్యాట్స్​మెన్ తమ గేమ్​లో​​ అడ్జెస్ట్​మెంట్స్​ చేసుకోవాలని మురళీ చెప్పాడు. ‘ఆస్ట్రేలియా వికెట్లపై బౌన్స్​ లభిస్తే.. ఇంగ్లండ్​ పిచ్​లపై స్వింగ్​ వస్తుంది. కాబట్టి దీనిపై వర్క్​ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిరంతర పక్రియ. కానీ, స్పోర్ట్స్​ పర్సన్​లో చాలా ఆందోళన ఉంటుంది. ఎందుకంటే సక్సెస్​ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉంటా యి. ఫెయిల్యూర్స్​పై ఆందోళన ఉన్నప్పుడు.. మన ముందు పెద్ద కాంపిటీషన్​ ఉంటుం దని తెలుసుకోవాలి. మనం ఆడకపోతే ప్లేస్​ పోతుందని గ్రహించాలి. సింపుల్​ లాజిక్. ఒక్కసారి విఫలమైతే.. వచ్చే ఆందోళన క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. ఈ ప్రాసెస్​లో మనం మానసికంగా వెనకబడిపోతాం. ఆసీస్​ సిరీస్​ తర్వాత మయాంక్​ మానసిక అంశాలపై వర్క్​ చేశాడు. కాబట్టే ఐపీఎల్​లో బాగా ఆడగలిగాడు. అగర్వాల్​లో అన్ని టెక్నిక్స్​ ఉన్నాయి. కావాల్సిందల్లా కాన్ఫిడెన్స్​ మాత్రమే. ఐపీఎల్​ పెర్ఫామెన్స్​ కచ్చితంగా అతని కాన్ఫిడెన్స్​ లెవెల్​ను పెంచుతుంది. ఇందులో ఎలాంటి డౌట్​ లేదు. ఐపీఎల్​కు ముందు మేం చేసిన వర్క్​ ఫలించింది కాబట్టి అది నిరంతరం కొనసాగాలి’ అని మురళీ వ్యాఖ్యానించాడు. బెంగళూరులో లాక్​డౌన్​ ఉండటం వల్ల తాము ఫిజికల్​గా ప్రిపేర్​ కాలేకపోయామన్నాడు. ఇది మయాంక్​ విషయం ఒక్కటే కాదు.. చాలా మంది క్రికెటర్లది ఇదే పరిస్థితి. ఐపీఎల్​ తర్వాత బ్యాట్​, బాల్​ ముట్టిందేలేదన్నాడు. అందుకే ఇంగ్లండ్​ టూర్​లో ఆరంభ రోజులు చాలా కీలకమన్నాడు. వీటిని అధిగమిస్తే మయాంక్​ కచ్చితంగా పెద్ద పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు.