శంషాబాద్‌‌లో బాసిల్ వుడ్స్ స్కూల్‌‌ ప్రారంభం

శంషాబాద్‌‌లో బాసిల్ వుడ్స్ స్కూల్‌‌ ప్రారంభం
  •     హరే రామ హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు
  •     ప్రారంభించిన సోమేశ్ కుమార్, మిథాలీరాజ్


శంషాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని శంషాబా ద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి గ్రామం లో 15 ఎకరాల విస్తీర్ణంలో హరే రామ హరే కృష్ణ మూమెంట్ గ్రూప్ ఆధ్వర్యంలో బాసిల్ వుడ్స్ స్కూల్‌‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సోమేశ్ కుమార్, భారత మహిళా క్రికెట్‌‌ జట్టు మాజీ కెప్టెన్‌‌ మిథాలీ రాజ్ హాజరై స్కూల్‌‌ స్పోర్ట్స్ గ్రౌండ్‌‌ని ప్రారంభించారు. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. హరే రామ హరే కృష్ణ మూమెంట్‌‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసిన ఈ స్కూల్‌‌ ఇతర స్కూళ్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉందన్నారు. ఇక్కడి వాతావరణం దేవాలయంలో మాదిరిగా ఉందని పేర్కొన్నారు. అన్ని స్కూళ్లు స్టూడెంట్లను ఉన్నత విద్యావంతులుగా, ధనవంతులుగా చేయడానికి బోధిస్తాయి.. కానీ ఈ స్కూల్‌‌ జీవితంలో మంచి మనిషిగా ఉండటానికి బోధిస్తాయని చెప్పారు. ఈ హైదరాబాద్‌‌ బాసిల్‌‌ వుడ్స్‌‌, హరే రామ హరే కృష్ణ మూమెంట్‌‌ హైదరాబాద్‌‌ అధ్యక్షుడు శ్రీసత్య గౌరవ చంద్రదాస ప్రభూజీ మాట్లాడుతూ, హైదరాబాద్‌‌లో శతాబ్దానికి పైగా ఇక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్లతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు తామే స్వయంగా సొంత స్కూల్‌‌తో వచ్చామని పేర్కొన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌‌ వైస్‌‌ చైర్మన్‌‌ శ్రీచంచలపతి దాస ప్రభూజీ మాట్లాడుతూ, శంషాబాద్‌‌లోని బాసిల్ వుడ్స్ స్కూల్ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ, అన్ని స్కూళ్లలాగే ఈ స్కూల్‌‌ కూడా ఉంటుందని తాను ఇక్కడికి వచ్చే ముందు అనుకున్నానని, అయితే, పాఠశాల వాతావరణాన్ని చూశాక తాను అనుకున్నది తప్పు అని తెలిసిందన్నారు.