ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఖేడ్ పట్టణంలోని కన్వెన్షన్ హాల్ లో ఆరు మండలాల సంబంధించిన 382 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజనల్ అధికారి శశికళ, నియోజకవర్గ నాయకులు రవీందర్ నాయక్,  రమేశ్​ చౌహన్, పరమేశ్, రాఘవరెడ్డి, నరసింహారెడ్డి, సంజీవ్ గంగారాం, నందు పటేల్, ప్రభాకర్ సత్యపాల్ రెడ్డి,  అధికారులు పాల్గొన్నారు.  

తాగిన మైకంలో పందెం.. చెరువులో గల్లంతు 

మెదక్​ (టేక్మాల్), వెలుగు:  తాగిన మైకంలో ఈత కొడుతూ చెరువు అవతలి గట్టుకు వెళ్లాలని పందెం కాసి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూర్​ లో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నలుగురు యువకులు కొచ్చెరువు గట్టు మీద కూర్చొని మద్యం తాగారు. తాగిన మైకంలో ఈత కొడుతూ చెరువు అవతలి వెపునకు వెళ్లాలని పందెం కాశారు. అట్కారి సాబేర్, రమేశ్​ అనే యువకులు చెరువులో ఈదుకుంటూ వెళ్తున్నారు. 
ఈ క్రమంలో  రమేశ్​ అవతలి గట్టుకు చేరుకున్నాడు. సాబేర్ మధ్యలోనే నీట మునిగిపోయాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

అమరుల త్యాగాలు మరువలేనివి

కోహెడ, వెలుగు : విధి నిర్వహణలో అమరులైన పోలీస్​అమరుల త్యాగాలు మరువ లేనివని హుస్నాబాద్​ సీఐ కిరణ్​ అన్నారు. ప్లాగ్​డే కార్యక్రమంలో భాగంగా మంగళవారం అక్కన్నపేట, కోహెడకు చెందిన పోలీస్​అమర వీరుల కుటుంబాలను పరామర్శించి సన్మానించారు. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో బలైన పోలీస్​అమర వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు నరేందర్​రెడ్డి, వివేక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సురేశ్​కు ఘన నివాళి

మునిపల్లి ( కోహీర్)/జహీరాబాద్, వెలుగు : కంగ్టి మండలంలోని నాగూర్​ (కె) గ్రామ శివారులో 2010లో స్మగ్లర్ల చేతిలో  హత్యకు గురైన కోహీర్​ మండలం గురుజువాడ గ్రామానికి చెందిన కానిస్టేబుల్​ జంగం సురేశ్​ ఫొటోకు పోలీసులు సోమవారం ఘన నివాళి అర్పించారు. సురేశ్​ తల్లిదండ్రులు సుశీలమ్మ, సుకంద్, సోదరుడు  నరేశ్​ను  జహీరాబాద్​ సీఐ భూపతి, కోహీర్​ ఎస్సై సురేశ్​ పరామర్శించారు.  

మెదక్​ జిల్లా ‘యాసంగి’ ప్రణాళిక సిద్ధం

మెదక్​టౌన్, వెలుగు : మెదక్ ​జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్​లో సాగుకు అనువైన పంటలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయాధికారిణి ఆశాకుమారి మంగళవారం తెలిపారు.  మొత్తం 2,43,937 ఎకరాల్లో ఆయా రకాల పంటలు సాగయ్యే అవకాశముందన్నారు. ఇందులో వరి 21,0445, మొక్కజొన్న 9,900, పొద్దు తిరుగుడు 2,800, వేరుశనగ 5,200, శనగ 3,100, గోధుమ 820, నువ్వులు 870, ఆవాలు 140,  జొన్న 6,543, మిగతా ఎకరాల్లో  ఆయా పంటలు సాగు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. ఆయా పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. 

ఏటీఎంలో రూ.30 లక్షలు మాయం

  • క్యాష్ అప్ లోడర్స్ పై అనుమానాలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏజెన్సీ

సంగారెడ్డి, వెలుగు  :  రెండు ఏటీఎంలలో నగదు మాయమై దాదాపు రూ.30 లక్షల లెక్క తేలడం లేదు. సంగారెడ్డి జిల్లా 65వ నేషనల్ హైవేపై ఉన్న కంది గ్రామంలోని రెండు ఏటీఎంలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నగదు మయం వెనుక ఇద్దరు క్యాష్ అప్ లోడర్స్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఏజెన్సీ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ఏజెన్సీలో పనిచేసే ఇద్దరూ వ్యక్తులు ఇటీవల రూ.30 లక్షలకు పైగా నగదును రెండు ఏటీఎమ్‌‌లలో నింపారు. నగదు నింపడం పూర్తయ్యాక ఏజెన్సీ వారికి డబ్బులు పెట్టినట్లు వెళ్లిన ఓటీపీని ఏజెన్సీ నిర్దారించుకున్నాక క్యాష్ అప్ లోడర్స్ తిరిగి ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టాలన్నా, తీసుకోవాలన్నా ఏజెన్సీ వారికి ఓటీపీ వెళ్తుంది. కానీ ఇక్కడ ఏజెన్సీ వారికి ఎలాంటి ఓటీపీ వెళ్లకుండానే డబ్బులు మాయమయ్యాయి. ఈ విషయమై 
అప్ లోడర్స్‌‌ ను ఏజెన్సీ వారు ప్రశ్నించగా, తాము డబ్బులు పెట్టాం.. ఆ తర్వాత మాకు తెలియదని బదులిచ్చారు. అనుమానంతో వారిపై ఏజెన్సీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

50 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్​

మునిపల్లి (న్యాల్​కల్)/కొమరవెల్లి, వెలుగు  : దీపావళి సందర్భంగా పేకాట ఆడుతున్న 50 మందిని హద్నూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. సంగారెడ్డి జిల్లా రాఘవపూర్, చాల్కి, అమీరాబాద్, వడ్డి, రాంతీర్త్, హద్నూర్ గ్రామాల్లో  మంగళవారం పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. 50మందిపై  కేసులు నమోదు చేసి రూ. 68,610 స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే బాధిత కుటుంబాలకు కలిగే ఇబ్బందులపై వారికి అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పరిధిలోనూ పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హార్వెస్టర్ పై నుంచి వెళ్లడంతో ఒకరు మృతి

మెదక్​ (టేక్మాల్​), వెలుగు: ప్రమాదవశాత్తు హార్వెస్టర్​ పై నుంచి వెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన టేక్మాల్ ​మండలం ధనూరలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మంగలి భాషయ్య (43) సోమవారం పశువులు మేపేందుకు పొలానికి వెళ్లాడు. కలాలి రాములు పొలం వద్ద ఒడ్డుపై పడుకున్నాడు. ఆ సమయంలో వరి పంటను కోస్తున్న హార్వెస్టర్​ డ్రైవర్​ నిర్లక్ష్యం కారణంగా భాషయ్య పై  నుంచి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని టేక్మాల్ ​పోలీసులు తెలిపారు.  

పక్కింటి వ్యక్తి తిట్టిండని మహిళ ఆత్మహత్య

మెదక్, వెలుగు: పక్కింటి వ్యక్తి తిట్టాడని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నార్సింగి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... గ్రామానికి చెందిన బోస్​ జగమయ్య, నర్సమ్మ దంపతులు తమ ఇంటి వెనుక ఇంకుడు గుంత తవ్వుతున్నారు. అక్కడ గుంత ఎందుకు తవ్వుతున్నారని పక్కింటికి సంపంగి శ్రీను వారితో గొడవపడ్డాడు. శ్రీను తమను బూతులు తిట్టాడని మనస్తాపానికి గురైన నర్సవ్వ గ్రామ శివార్లలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చికిత్స పొందుతూ..

మెదక్​ (కౌడిపల్లి), వెలుగు : రెండు బైకులు ఢీకొన్న ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం... కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన చాకలి శేఖులు (35) హార్వెస్టర్​ డ్రైవర్ గా పనిచేసేవాడు. 23న సాయంత్రం హార్వెస్టర్ నడపటానికి టేక్మాల్ వెళ్తున్నానని తల్లితో చెప్పి బైక్​ మీద బయలుదేరాడు. అతడి బైక్, కూకుట్లపల్లి నుంచి కౌడిపల్లి వస్తున్న మరో బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో తీవ్రంగా గాయపడిన శేఖులు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తల్లి రామమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమై... చెరువులో శవమై..

రామాయంపేట, వెలుగు : రామాయంపేటలో మిస్సింగ్ అయిన యువకుడు  స్థానిక కొచ్చెరువులో సోమవారం శవమై తేలాడు. స్థానిక ఎస్సై రాజేశ్ ​తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన పోచమ్మల స్వామి చిన్న కొడుకు సందీప్ (29) ఈ నెల 14న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సోమవారం పట్టణ శివారులోని కొచ్చెరువులో అతడి డెడ్ బాడీ లభ్యమైంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కూరగాయలు తెచ్చేందుకు వెళ్లి..

సిద్దిపేట రూరల్, వెలుగు : కూరగాయలు తెచ్చేందుకు వెళ్లి ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ 
పరిధిలో సోమవారం జరిగింది. సీఐ భాను ప్రకాశ్​తెలిపిన ప్రకారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన సిరివేని మురళి (56) దీపావళి పండుగ సందర్భంగా కూరగాయలతోపాటు పూజ సామగ్రి తెచ్చేందుకు స్కూటీపై పట్టణంలోని రైతు బజార్ కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా హరిహర రెసిడెన్సి వద్ద అతడి స్కూటీని కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో మురళి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని 108 అంబులెన్స్​లో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా అతడు చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

గుండెపోటుతో కోహీర్​ ఆర్ఐ...

మునిపల్లి, (కోహీర్​), వెలుగు : కోహీర్​ మండలంలోని  కవెలి గ్రామానికి చెందిన శ్రీధర్​రెడ్డి (52)  బీరం గూడలో నివాసం ఉంటూ కోహీర్​లో  ఆర్​ఐగా  విధుల నిర్వహిస్తున్నాడు. రోజులాగే మంగళవారం ఉదయం విధుల కోసం బీరంగూడలోని తన ఇంటి నుంచి ఆటోలో బయలుదేరాడు.  హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది. స్థానికులు అదే ఆటోలో అతడిని సమీపంలోని ఓ ఆసుపత్రికి  తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. కోహీర్ తహసీల్దార్​ కిషన్​ నాయక్​ తోపాటు  ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

అనారోగ్యంతో వీఆర్ఏ..

మునిపల్లి, వెలుగు : మండలంలోని ఖమ్మం పల్లి  వీఆర్ఏ మన్నె అశోక్ (45)​ కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్​ ప్రవీణ్​కుమార్,  టీఆర్ఎస్​ రాష్ర్ట నాయకుడు పైతర సాయికుమార్ బాధిత కుటుంబ సభ్యులను కలిసి 
పరామర్శించారు.

ఆలయాల మూసివేత

కొమురవెల్లి/పాపన్నపేట/చిలప్​చెడ్, వెలుగు: సూర్య గ్రహణం కారణంగా మంగళవారం ఉమ్మడి మెదక్​ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు మూతపడ్డాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి, పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గ భవాని, చిలప్​చెడ్​ మండలం చిట్కుల్​ లోని చాముండేశ్వరీ ఆలయాన్ని పూజారులు మూసివేశారు.

ఉత్సాహంగా దీపావళి

దీపావళి పండుగను ఉమ్మడి మెదక్​ జిల్లాలో ఉత్సాహంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయమే సంప్రదాయబద్ధంగా అక్కాచెల్లెళ్లు సోదరులకు హారతినిచ్చి ఆశీర్వదించారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాలు, ఇండ్లు, దుకాణాల్లో లక్ష్మీపూజలు నిర్వహించారు.  పటాకుల దుకాణం వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు చిన్న, పెద్ద తేడా లేకుండా పాటాకులు పేల్చుతూ ఆనందంగా గడిపారు.  - వెలుగు, నెట్​వర్క్​

అంకితభావంతో విధులు నిర్వహించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రతి పోలీస్ అధికారి అంకితభావంతో విధులు నిర్వహించాలని సీపీ ఎన్.శ్వేత సూచించారు. మంగళవారం సీపీ ఆఫీస్ లో సెప్టెంబర్ నెలలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 60 మంది పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆమె ప్రోత్సహకాలను అందజేశారు. కష్టపడేవారికి డిపార్ట్ మెంట్ లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏసీపీలు రమేశ్, దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్ పాల్గొన్నారు. 

50 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్​

మునిపల్లి (న్యాల్​కల్)/కొమరవెల్లి, వెలుగు  : దీపావళి సందర్భంగా పేకాట ఆడుతున్న 50 మందిని హద్నూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. సంగారెడ్డి జిల్లా రాఘవపూర్, చాల్కి, అమీరాబాద్, వడ్డి, రాంతీర్త్, హద్నూర్ గ్రామాల్లో  మంగళవారం పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. 50మందిపై  కేసులు నమోదు చేసి రూ. 68,610 స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే బాధిత కుటుంబాలకు కలిగే ఇబ్బందులపై వారికి అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పరిధిలోనూ పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బంగారు తెలంగాణ పేరుతో బాగుపడ్డది కేసీఆరే.. 

నర్సాపూర్, వెలుగు : బంగారు తెలంగాణ పేరుతో బాగుపడ్డది కేసీఆర్​ కుటుంబమేనని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అన్నారు. 2018లో రూ.2 కోట్ల 50 లక్షలతో నర్సాపూర్ మెదక్ నేషనల్ హైవే చిన్న చింతకుంట చౌరస్తా నుంచి గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, స్ట్రీట్ లైట్ ఏర్పాటు కోసం  శంకుస్థాపన చేసిన శిలాఫలకం వద్ద మంగళవారం బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మురళి యాదవ్ మాట్లాడుతూ సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని ఎమ్మెల్యే మునుగోడులో ‘అది చేస్తా.. ఇది చేస్తా’ అంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మిగులు రాష్ట్రాన్ని నిధులు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం.. ఆ తర్వాత ఎవరో ఒకరిచేత కోర్టులో కేసులు వేయించి ఆ పనులు ఆపేయడం మామూలుగా మారిందని  ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి చిన్న చింతకుంట డబుల్ రోడ్డు నిర్మాణం, మున్సిపాలిటీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వాల్దాస్ మల్లేశ్​గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాప గారి రమేశ్​గౌడ్, జిల్లా అధ్యక్షుడు రమేశ్, కొలను రవి, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నగేశ్, లక్ష్మణ్, ప్రవీణ్ పాల్గొన్నారు.