V6 News

సైబర్ నేరగాళ్ల కోసం జల్లెడ..కొనసాగుతున్న ఆపరేషన్‌‌ క్రాక్‌‌డౌన్‌‌ 2.0

సైబర్ నేరగాళ్ల కోసం జల్లెడ..కొనసాగుతున్న ఆపరేషన్‌‌ క్రాక్‌‌డౌన్‌‌ 2.0
  •     సైబర్‌‌ క్రైమ్స్​తో లింకులున్న 3,567 మంది అరెస్ట్‌‌
  •     రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పోలీసులతో కలిసి భారీ సెర్చ్‌‌ ఆపరేషన్‌‌
  •     218 మంది  గుర్తింపు.. 115 మంది కోసం గాలింపు కొనసాగింపు

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్‌‌ నేరాలపై తెలంగాణ సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌‌బీ) నిర్వహిస్తున్న “ఆపరేషన్‌‌ క్రాక్‌‌డౌన్‌‌ 2.0” కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదైన సైబర్‌‌ నేరాలతో పాటు దేశవ్యాప్తంగా నమోదైన కేసులతో సంబంధం ఉన్న మ్యూల్‌‌ అకౌంట్‌‌ ఖాతాదారులు, ఏజెంట్లు, బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత రెండేళ్లలో మొత్తం 3,567 మందిని అరెస్టు చేశారు. వీరిలో 614 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. 

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సైబర్‌‌ నేరాలకు పాల్పడి గతంలో అరెస్టయి బెయిల్‌‌పై బయటకు వచ్చిన పాత నిందితులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలంగాణ సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌‌ శిఖా గోయల్‌‌ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మళ్లీ ఏవైనా నేరాల్లో పాల్గొంటున్నారా అనే అంశాలపై స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్‌‌ క్రాక్‌‌డౌన్‌‌ చేపట్టినట్లు వెల్లడించారు.

300 బృందాలతో ఆపరేషన్‌‌

ఆపరేషన్‌‌ క్రాక్‌‌డౌన్‌‌ 2.0ను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 300 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్‌‌ నేరాల్లో ఇప్పటికే నిందితులుగా ఉన్న వారి నివాసాలను ప్రత్యక్షంగా తనిఖీ చేయడం, నిందితుల లొకేషన్‌‌ ట్రాకింగ్‌‌, వారి ఆర్థిక లావాదేవీలు, డిజిటల్‌‌ కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్‌‌ సేకరణ, వారికి సహకరిస్తున్న నెట్‌‌వర్క్‌‌ లేదా అనుబంధ వ్యక్తులను గుర్తించడం, బెయిల్‌‌ నిబంధనలను అతిక్రమించకుండా పర్యవేక్షించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

115 మంది నిందితుల జాడ లేదు

తెలంగాణలో నమోదైన 480 కేసులు, దేశవ్యాప్తంగా నమోదైన 1,233 కేసుల నిందితుల డేటా ఆధారంగా ఈ ఆపరేషన్‌‌ కొనసాగుతున్నట్లు శిఖా గోయల్‌‌ తెలిపారు. ఇందులో మ్యూల్‌‌ అకౌంట్‌‌ హోల్డర్లు 269 మంది కాగా, 155 మంది ఏజెంట్లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తాజా తనిఖీలలో మొత్తం 335 మందిని వెరిఫై చేయగా, అందులో 218 మంది తమ పాత నివాస ప్రాంతాల్లోనే ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మరో ఇద్దరు మరణించగా, 115 మంది జాడ తెలియలేదని పేర్కొన్నారు. 

జాడ తెలియని నిందితుల వివరాలు సేకరిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబర్‌‌ నేరాల్లో అరెస్టైనవారు విడుదలైన తర్వాత కూడా నిరంతర నిఘాలో ఉంటారనే స్పష్టమైన సందేశం ఇవ్వడానికే ఆపరేషన్‌‌ క్రాక్‌‌డౌన్‌‌ 2.0 నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైబర్‌‌ మోసాల నుంచి పౌరులను రక్షించేందుకు, ప్రతి దశలోనూ సైబర్‌‌ నేరాలను గుర్తించి అరికట్టేందుకు తమ విభాగం కట్టుబడి ఉందని శిఖా గోయల్‌‌ స్పష్టం చేశారు.