రాజస్థాన్​లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేల తీర్మానం

రాజస్థాన్​లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేల తీర్మానం
  • గెహ్లాటే ఉండాలె.. ఆయన చెప్పినోళ్లన్న కావాలె
  • కాదంటే రాజీనామాలేనని హైకమాండ్​కు అల్టిమేటం
  •  స్పీకర్​ ఇంటికి 92 మంది ఎమ్మెల్యేలు.. అర్ధరాత్రి హైడ్రామా

జైపూర్: రాజస్థాన్​ కాంగ్రెస్​ పార్టీలో సంక్షోభం నెలకొంది. సీఎం గెహ్లాట్​ను అదే పదవిలో కొనసాగించాలని పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్​ చేస్తున్నారు. కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సీఎంగా కొనసాగాలని అంటున్నారు. లేదంటే ఆయన సూచించిన వారినే తర్వాతి సీఎంగా ఎంపిక చేయాలని పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్​ పైలట్​ను సీఎంను చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైలట్​ వైపే హైకమాండ్​ మొగ్గుచూపితే తామంతా రాజీనామా చేస్తామని 92 మంది ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఈమేరకు ఆదివారం రాత్రి రాజీనామా లేఖలతో స్పీకర్​ సీపీ జోషి ఇంటికి చేరుకున్నారు. అంతకుముందు మంత్రి శాంతి ధరివాల్​ ఇంట్లో అశోక్​ గెహ్లాట్​ వర్గంలోని 92 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 2020లో పైలెట్​ తిరుగుబాటు అంశంపై చర్చించారు. ఆ సమయంలో గవర్నమెంట్​కు మద్దతు ఇచ్చిన వారి నుంచి ఒకరికి సీఎం పదవి ఇవ్వాలని తీర్మానం చేశారు.

మా సీఎం గెహ్లాటే.. ఖచరియావాస్

ఎమ్మెల్యేల అభిప్రాయాలను గెహ్లాట్​ పరిగణలోకి తీసుకోవాలని పార్టీ​నేత ప్రతాప్​సింగ్​ ఖచరియావాస్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలన్నది 92 మంది ఎమ్మెల్యేల అభిప్రాయమని వివరించారు. తమతో మాటమాత్రమైనా చెప్పకుండా కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల పోటీకి గెహ్లాట్​ ఎలా రెడీ అయ్యారని నిలదీశారు. 

హైకమాండ్​ నిర్ణయమే ఫైనల్: మంత్రి సుభాశ్

హైకమాండ్ నిర్ణయమే పార్టీలో ఫైనల్​ అని మంత్రి సుభాశ్​ గార్గ్​ స్పష్టం చేశారు. ఆ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. అయితే, రెండేండ్ల క్రితం పార్టీని చీల్చి, గెహ్లాట్​ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్​ పైలట్​ ప్రయత్నించిన విషయాన్ని మరవొద్దన్నారు. అందుకే ఇప్పుడు సీఎం సీటు ఖాళీ అయితే పార్టీకి నమ్మకస్తుడినే కూర్చోబెట్టాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు విలువిస్తూ, వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడినే ఎంపిక చేయాలని హైకమాండ్​కు విజ్ఞప్తి చేశారు. 

గెహ్లాట్​ ఇంట్లో సీఎల్​పీ భేటీ

సీఎం అభ్యర్థి ఎన్నికపై చర్చించేందుకు సీఎం అశోక్​ గెహ్లాట్​ ఇంట్లో ఆదివారం రాత్రి కాంగ్రెస్​ లెజిస్లేచర్​ పార్టీ (సీఎల్​పీ) భేటీకి నిర్ణయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్​ మాకెన్​ను స్టేట్ ఇన్​చార్జ్​గా, మల్లికార్జున్​ ఖర్గేను అబ్జర్వర్​గా సోనియా గాంధీ నియమించారు. వీరు కూడా సీఎల్​పీ భేటీకి జైపూర్​ చేరుకున్నారు. గెహ్లాట్​ ఇంటికి సచిన్​ పైలెట్​తో పాటు మాకెన్​, ఖర్గే చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా లేఖలు తీసుకొని  స్పీకర్​ సీపీ జోషి ఇంటికెళ్లడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

నా చేతుల్లో ఏమీ లేదు: గెహ్లాట్

ఎమ్మెల్యేలంతా కోపంగా ఉన్నారని సీఎం అశోక్ గెహ్లాట్​పేర్కొన్నారు. తర్వాతి సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో బాగా పట్టుదలగా ఉన్నారని గెహ్లాట్​ చెప్పారు. ఈ విషయంలో వాళ్లు ఎవరిమాటా వినేలా లేరని అన్నారు. విషయం తన చేతులు దాటిపోయిందని పార్టీ హైకమాండ్​కు గెహ్లాట్​ఫోన్​లో వివరించారు.