కార్పొరేట్ల కోసమే ‘కగార్‌‌’ ...‘వెలుగు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోయిస్టు చంద్రన్న

కార్పొరేట్ల కోసమే ‘కగార్‌‌’ ...‘వెలుగు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోయిస్టు చంద్రన్న
  • ఆయుధం వదిలేశా, సిద్ధాంతం కాదు.. ప్రజల్లో ఉండే పనిచేస్తా
  • మావోయిస్టు భావజాలం ఎప్పటికీ సజీవం 
  • చీలికలు, సమన్వయలోపం, కోవర్టుల వల్లే పార్టీకి తీవ్ర నష్టం 
  • రూ.400 కోట్లు, బంగారం డంపులు అవాస్తవం
  • ఆ డబ్బే ఉంటే బిల్డింగులు కట్టుకునేవాళ్లం.. నా భార్య గుడిసెలో ఉంటోందని వెల్లడి 
  • అడవుల్లోని ఖనిజ సంపద దోపిడీకి ప్రయత్నిస్తున్నరు 

హైదరాబాద్‌, వెలుగు: మావోయిస్టు భావజాలానికి అంతం లేదని మాజీ మావోయిస్టు చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాద్‌రావు అన్నారు. మావోయిజం ప్రజల్లో సజీవంగానే ఉందన్నారు. ఒకప్పుడు జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం పోరాడామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోవడమే పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందని చెప్పారు. 

మావోయిస్టు పార్టీ వద్ద రూ.400 కోట్లు, కిలోల కొద్దీ బంగారం డంపులు ఉన్నాయన్నది అవాస్తమని వెల్లడించారు. అడవుల్లోని ఖనిజ సంపదపను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే ‘ఆపరేషన్ కగార్’ నిర్వహిస్తున్నారని అన్నారు. నేతల మధ్య సమన్వయ లోపమే పార్టీకి నష్టాన్ని కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. 45 ఏండ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న చంద్రన్న.. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిశారు. 

డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన అనంతరం శనివారం ఆయన ‘వెలుగు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అనారోగ్య కారణాలతోనే  అజ్ఞాతం వీడానని స్పష్టం చేశారు. ఇన్నేండ్ల పోరాటం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇకముందు ప్రజా జీవితంలో పౌరహక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇతర సంస్థలతో కలిసి పని చేస్తానన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. 

ఆయుధాలు వదిలి ప్రజలతో కలిసి..

  ఆయుధాలతో లొంగిపోవడం వేరు, జనజీవన స్రవంతిలో కలవడం వేరని చంద్రన్న అన్నారు. ప్రస్తుతం ఆయుధాలు లేకుండానే ప్రజల కోసం పని చేస్తానన్నారు. మావోయిస్టు పార్టీకి ఇప్పటికీ ప్రజా బలం ఉందని తెలిపారు. “నేను1980లో పార్టీలో చేరాను. మార్క్సిజం, -లెనినిజం, మావోయిస్టు సిద్ధాంతంతో పనిచేశాం. ఈ సిద్ధాంతం ఓడిపోలేదు.. ప్రజల మధ్యనే ఉన్నది. 

నా భావజాలం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. అప్పట్లో భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. ఆదివాసుల కోసం పోరాడాం. వారికి భూములు ఇప్పించాం. పీడిత జనానికి అండగా నిలబడ్డాం. నేను 45 ఏండ్ల పాటు ప్రజల కోసమే పనిచేశా. ఇకపై ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటూ పని చేస్తా” అని ఆయన వివరించారు. ‘‘అంతర్గతంగా చీలికలు, సమన్వయ లోపం, కొంతమంది కోవర్టుల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. పార్టీ కేవలం అటవీ ప్రాంతానికే పరిమితమయ్యింది. 

పట్టణ, మైదాన ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరగలేదు. గతంలో మేధావులు, చదువుకున్న వారు చేరేవారు.. క్రమంగా చదువుకున్న యువత మావోయిస్టు పార్టీలోకి రావడం తగ్గిపోయింది. అటవీ ప్రాంతాల్లోనూ నిరక్షరాస్యులే పార్టీలో ఉన్నారు” అని చంద్రన్న తెలిపారు.ఈ కారణాలతోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రిక్రూట్‌మెంట్లు జరగడం లేదని వెల్లడించారు. 

పార్టీలో స్థాయిని బట్టి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఫోన్లు వినియోగిస్తారన్నారు. సీసీలకు, స్టేట్‌ జోనల్‌ కమిటీల కీలక నాయకులకే ఫోన్లు వాడాలన్న నియమాలు ఉన్నాయన్నారు. కానీ, క్రమంగా అందరూ ఫోన్లు వాడే పరిస్థితి నెలకొందన్నారు.

కుల వివక్ష లేదు.. సమన్వయమే దెబ్బతిన్నది 

మావోయిస్టు పార్టీ వద్ద వందల కోట్ల రూపాయల నిధులు, బంగారం డంపులు ఉన్నాయనేది అబద్ధమని చంద్రన్న స్పష్టం చేశారు. ‘‘పార్టీ మనుగడ కోసం స్థానికుల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు, తునికాకు కాంట్రాక్టర్లు, ఇతర కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీలలో నిధుల సేకరణ జరుగుతుంది. అవి కూడా నిత్యావసరాల కోసమే ఖర్చు చేస్తాం. డబ్బులు లేకుండా మావోయిస్టులు కూడా పార్టీని నడపలేరు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఫండ్‌ కూడా రావడం లేదు. నేను పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా17 ఏళ్లుగా పని చేశాను. ఇలా నేను సంపాదించి ఉంటే ఆ డబ్బును బయట ఉన్న కుటుంబానికి పంపుతాను కదా.. నా భార్య ఇప్పటికీ చిన్న గుడిసెలో ఉంటోంది. ఈ మధ్యే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని నాకు తెలిసింది. పార్టీ దగ్గర వందల కోట్లు ఉంటే.. బిల్డింగులు కట్టుకునే వాళ్లం కదా..” అని ఆయన అన్నారు.

పార్టీలో అగ్ర నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బతిన్నదని వెల్లడించారు. “కేంద్ర కమిటీ మెంబర్ల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలున్నా.. కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ మృతి తర్వాత ఆ విబేధాలు బహిర్గతం కావడం మొదలైంది. అయితే, పార్టీ అగ్రనాయత్వం మధ్య కుల వివక్షకు తావులేదు. 

కగార్‌ దాడి పెరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సీసీ మెంబర్లు, పొలిట్‌ బ్యూరో సభ్యుల వంటి కీలక నాయకులు ఒక దగ్గరకు చేరే అవకాశాలు లేకుండా పోయాయి. కోవర్టుల బెడద పెరగడంతోనూ పార్టీ బలహీనపడుతూ వస్తోంది” అని వెల్లడించారు

మావోయిస్టు భావజాలానికి అంతం లేదని మాజీ మావోయిస్టు చంద్రన్న అన్నారు. ఒకప్పుడు జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం పోరాడామని తెలిపారు. అడవుల్లోని ఖనిజ సంపదపను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే ‘ఆపరేషన్ కగార్’ నిర్వహిస్తున్నారన్నారు.