న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరను మళ్లీ పెంచడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ధరల షాక్ ల నుంచి దేశ ప్రజలను రక్షించలేకపోతోందని విమర్శించాయి. గృహ వినియోగ (డొమెస్టిక్) ఎల్పీజీ గ్యాస్ ధరను ఆయిల్ కంపెనీలు శనివారం రూ. 29 మేరకు పెంచాయి.
పెరిగిన ధర ఆదివారం నుంచే అమలులోకి వచ్చింది. దీంతో మూడు నెలల్లోనే ఎల్పీజీ ధరను రెండోసారి భారీగా పెంచడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, టీఎంసీ, ఇతర పార్టీలు ఫైర్ అయ్యాయి. ‘విశ్వగురు’ అని ప్రగల్భాలు పలికే కేంద్ర ప్రభుత్వం పదే పదే ఎదురవుతున్న ధరల షాకుల నుంచి తన సొంత పౌరులను మాత్రం రక్షించలేకపోతోందని ‘ఎక్స్’ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విమర్శించింది.
‘‘ఇదే బీజేపీ4ఇండియా మోడల్. ప్రపంచ సంక్షోభాలు తలెత్తినప్పుడు, పేదలు ఆందోళన చెందుతూనే ఉంటారు. ధనవంతులు వృద్ధి చెందుతూనే ఉంటారు. ముందస్తు ప్రణాళికలు వేసి, సామాన్యులను రక్షించడానికి బదులుగా, మోదీ ప్రభుత్వం భారాన్ని మోపుతూనే ఉంది’’ అని పేర్కొంది. ‘‘ధనవంతులకు ఇది ఒక చిన్న అసౌకర్యం. మిలియన్ల కొద్దీ కుటుంబాలకు, ఇప్పటికే భారంగా మారిన ఇంటి బడ్జెట్‌లపై ఇది మరో దెబ్బ” అని టీఎంసీ తెలిపింది.
తాజా ధరల పెంపుపై కాంగ్రెస్ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘‘ఇన్ఫ్లేషన్ మ్యాన్ మోదీ మళ్లీ కొరడా ఝుళిపించారు. ఇప్పుడు ఎల్పీజీని మరోసారిప్రియం చేశారు. మోదీ ఫార్ములా స్పష్టంగా ఉంది.
ప్రజల నుంచి వసూలు చేయడం, ధనవంతులైన స్నేహితుల ఖజానా నింపడం” అని విమర్శించింది. వంట గ్యాస్ ధరలను పెంచినందుకు కేంద్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా దుయ్యబట్టింది. ‘‘ద్రవ్యోల్బణం ఇప్పటికే ప్రజల నడ్డి విరిచింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వారి కడుపుపై కూడా కొడుతోంది” అని పేర్కొంది. నిత్యావసర వస్తువుల ధరలు తరచూ పెరగడం ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.
- మూడు నెలల్లో రెండోసారి పెంపు
గృహ వినియోగ ఎల్పీజీ ధరలు సిలిండర్‌కు రూ.29 చొప్పున పెరిగాయి. సవరించిన ధర ఆదివారం (జూన్ 7) నుంచి అమలులోకి వచ్చింది. తాజా ఎల్పీజీ ధరల పెంపు తర్వాత, ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.913 నుంచి రూ.942కి పెరిగింది. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో అంతరాయాల కారణంగా మార్చి 7న చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సిలిండర్‌కు రూ.60 వరకు పెంచాయి. తాజాగా మరోసారి పెంచడంతో సామాన్యుడిపై మరింత భారం పడినట్టయింది.
