పెంబి మండలంలో ఉద్రిక్తత

పెంబి మండలంలో ఉద్రిక్తత

ఖానాపూర్, వెలుగు: నిర్మల్​ జిల్లా పెంబి ఎంపీపీ కవిత భర్తపై నమోదైన కేసు వివాదం మండలంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పస్పుల గ్రామం వద్ద  బ్రిడ్జి , రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన తనను పెంబి ఎంపీపీ కవిత భర్త గోవింద్ డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కాంట్రాక్టర్ సురేందర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో గోవిందుపై ఇటీవల కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గోవింద్పై  అక్రమంగా పెట్టిన కేసును నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బుధవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మండలంలో పర్యటిస్తున్నారు. ఆమెను చూసి ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో  ఇరుపక్షాల నాయకులపైకి దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కక్షగట్టి ప్రజాప్రతినిధులను,  లీడర్లను ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఆందోళనలో జడ్పీటీసీ జానుబాయి, కిషోర్ నాయక్, రాజేందర్ నాయక్, గోపాల్ రెడ్డి, విలాస్ పరశురామ్, సిద్దార్థ్ నాయక్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.