ఎగ్జిట్​ పోల్స్​ కరెక్టేనా?

ఎగ్జిట్​ పోల్స్​ కరెక్టేనా?

న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, మోడీ మరోసారి ప్రధాని అవుతారంటూ పలు సంస్థలు చేపట్టిన ఎగ్జిట్​ పోల్స్​లో వాస్తవం ఎంత ఉంది?  వాటి అంచనాలను నమ్మడానికి వీలులేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ సారి సర్వే సంస్థలు​ పూర్తిగా రాంగ్​ రిజల్ట్స్​ ఇచ్చాయని వాదిస్తున్నాయి. తమ ఐక్యతను దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదని మండిపడుతున్నాయి. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, చత్తీస్​గఢ్​లో ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచిందని, అక్కడ కూడా ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారంటేనే ఎగ్జిట్​ పోల్స్​ విశ్వసనీయత ఏమిటో అర్థమవుతుందంటున్నాయి.

అమెరికాలో, ఆస్ట్రేలియాలో తారుమారు

2016లో జరిగిన అమెరికా ప్రెసిడెంట్​ ఎన్నికల్లో ఎగ్జిట్​పోల్స్​ తారుమారయ్యాయి. డెమోక్రటిక్​ పార్లీ లీడర్​ హిల్లరీ క్లింటన్​ ప్రెసిడెంట్​ అవుతారని దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. కానీ.. అసలు రిజల్ట్స్​వచ్చేసరికి రిపబ్లికన్​ పార్టీ లీడర్​ డొనాల్డ్​ ట్రంప్​ విజయం సాధించారు. ట్రంప్​ ప్రెసిడెంట్​ అయ్యారు. ఇక, ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ ప్రతిపక్ష లేబర్‌ పార్టీ విజయం సాధిస్తుందని దాదాపు 56 ఎగ్జిట్​పోల్స్​ అంచనా వేశాయి. కానీ అధికార లిబరల్‌ పార్టీ విజయం సాధించింది.

సైలెంట్​ ఓటును పట్టుకోలేని సంస్థలు!

అమెరికాలో, ఆస్ట్రేలియాలో సర్వే సంస్థలు సైలెంట్​ ఓటును కనిపెట్టలేకపోయాయని, అందుకే అవి అక్కడ ఫెయిల్​ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మన దగ్గర చాలా మంది ఓటర్లు తాము ఎవరికి ఓటేశామన్నది చెప్పడానికి ఇష్టపడరని వారు చెప్తున్నారు. ప్రతిపక్షాలన్నీ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్కటైన ప్రస్తుత సమయంలో ఏకపక్షంగా ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు రావడం నమ్మలేకపోతున్నామంటున్నారు. ఐదేళ్ల ఎన్డీయే ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపించిందని, అది సైలెంట్​ ఓటుగా పడిందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. ఎగ్జిట్​ పోల్స్​ రాగానే.. దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు కొట్టిపారేశాయి. ఈవీఎంలను తారుమారుచేసే కుట్రలో భాగంగానే ఎగ్జిట్​ పోల్స్​ను ఎన్డీయేకు అనుకూలంగా ఇచ్చారని టీఎంసీ చీఫ్​ మమత ఫైర్​ అయ్యారు. మన దేశంలో ఎగ్జిట్​ పోల్స్ చాలా సందర్భాల్లో నిజమయ్యాయని, ఒకవేళ ఈ సారి మాత్రం అవి రాంగైతే సర్వే సంస్థలు విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందని సర్వే రంగ నిపుణులు అంటున్నారు.